
తంజావూరులోని వ్యవసాయ కళాశాల, పరిశోధనా సంస్థకు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరితవిప్లవ పితామహుడు డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్ పేరు పెడుతున్నట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.అలాగే, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్లాంట్ ప్రోపగేషన్, జెనిటిక్స్ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన వారిని సత్కరించేందుకు స్వామినాథన్ పేరిట అవార్డును ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. తంజావూరులోని ఈచన్‌కోట్టైలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ను డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ అగ్రికల్చరల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌గా మారుస్తామని ప్రకటించారు.పద్మవిభూషణ్, మెగసెసే అవార్డులతో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలతో గౌరవం పొందిన స్వామినాథన్‌ను గౌరవించుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 1960వ దశకంలో దేశంలో హరిత విప్లవానికి స్వామినాథన్ చేసిన కృషిని స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. స్వామినాథన్ 1969లోనే వాతావరణ మార్పుల గురించి మాట్లాడారని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 28న ఎం.ఎస్.స్వామినాథన్ చెన్నైలో కన్నుమూశారు.





