
రష్మీ సమంత్ రచించిన ఏ హిందూ ఇన్ ఆక్స్‌ఫర్డ్ పుస్తకాన్ని ఢిల్లీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ విడుదల చేశారు.
యువతలో పోరాట స్ఫూర్తి నింపేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని.. ఏ హిందూ ఇన్ ఆక్స్‌ఫర్డ్‌లో తన పోరాటాన్ని రష్మీ సమంత్ రాశారని సునీల్ అంబేకర్ అన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చదువుకోవడానికి వెళ్లి స్వాతంత్య్రం కోసం భారతదేశ పతాకాన్ని నాటి యువత ఎగురవేశారని తెలిపారు. భారత్‌లో సంక్షోభం ఏర్పడినప్పుడల్లా అక్కడికి వెళ్లిన భారతీయులు బ్రిటిష్ నేల నుంచే భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారని.. భారతదేశ సంస్కృతి పట్ల మనం ఎప్పుడూ గర్వపడాలని తెలిపారు.
లోక కళ్యాణమే మన జాతి తత్వమని.. భారతదేశం తన శ్రేయస్సును ప్రపంచ సంక్షేమం కోసం ఉపయోగించిన దేశమని కొనియాడారు. అనేక దండయాత్రలు జరిగినప్పటికీ, భారతదేశం తన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు సాగుతోందన్నారు. వలసపాలనలో, విదేశీ బానిసత్వం బారిన పడిన ప్రజలను విముక్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మద్రాసు పేరును చెన్నైగా మార్చినప్పుడు సెక్యులర్ అనలేదు. బొంబాయి పేరును ముంబైగా మార్చితే అది సెక్యులర్ కాలేదు, కానీ అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చినప్పుడు అది మతతత్వమా? అని సునీల్ అంబేకర్ ప్రశ్నించారు.
ఏ హిందూ ఇన్ ఆక్స్‌ఫర్డ్ పుస్తకం గురించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ఈ పుస్తకంలో రష్మీ సమంత్ తన పోరాటం గురించి రాసారని.. నేడు ప్రపంచం భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను అంగీకరిస్తోందని పేర్కొన్నారు.
తిరుగులేని ధైర్యం, వలసరాజ్యం, జాత్యహంకారం, వివక్షపై విజయానికి ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా.. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా రష్మీ సమంత్ ఎన్నికయ్యారు. ఆ దశలో తాను ఎదుర్కొన్న అంశాల గురించి ఏ హిందూ ఇన్ ఆక్స్‌ఫర్డ్ పుస్తకంలో పేర్కొన్నారు.





