
త్రిపురలో దేశ సార్వభౌమత్వానికి, సమైక్యతకు వ్యతిరేకంగా దేశ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్న తిరుగుబాటు గ్రూపులైన, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర-ఎన్‌ఎల్‌ఎఫ్‌టి, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్-ఎటిటిఎఫ్ లపై ఐదేళ్ల నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిషేధం రెండు గ్రూపులకు చెందిన అనుబంధ సంస్థలకు కూడా వర్తిస్తుందని తెలిపింది.
భారత్ నుండి త్రిపురను విడదీసి ప్రత్యేక దేశంగా చేయడమే లక్ష్యంగా ఎన్‌ఎల్‌ఎఫ్‌టి, ఎటిటిఎఫ్‌ల పనిచేస్తున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నో ఏళ్లుగా ఇతర సంస్థల సాయంతో సాయుధ తిరుగుబాటు చేస్తూ త్రిపుర ప్రజలను రెచ్చగొడుతున్నాయని తెలిపింది.
ఈ రెండు గ్రూపులు విధ్వంసకర, హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని, తమ లక్ష్యాన్ని సాధించుకునేందుకు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని.. ఈ రెండు గ్రూపులు దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు ముప్పుగా భావించి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 3 ప్రకారం ఎన్‌ఎల్‌ఎఫ్‌టి, ఎటిటిఎఫ్ గ్రూపులను వాటి అనుబంధ సంస్థలపై చర్య తీసుకుంటునట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది




