News

ఆంధ్రా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గా వంద చర్చిల ప్రతినిధి!

338views

నిబంధనలు అన్నింటిని గాలికి వదిలేసి, అడ్డదిడ్డంగా వందకు పైగా చర్చిలకు ప్రాతినిధ్యం వహించే ఒకరిని ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న జేమ్స్‌ స్టీఫెన్‌ ఇప్పటికే వర్సిటీలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చైర్‌ ప్రొఫెసర్‌గా అక్రమంగా నియమించారు. తాజాగా బుధవారం నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు అదనంగా (అడిషనల్‌ చార్జ్‌) కీలకమైన రిజిస్ర్టార్‌ బాధ్యతలు కట్టబెట్టారు.

దేశంలోనే స్వతంత్రంకు ముందే వెలిసిన యూనివర్సిటీలలో ఒకటైన ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీలో సీనియర్‌ ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నప్పటికీ, వారందరినీ పక్కనపెట్టి ప్రైవేటు కళాశాల నుంచి అడ్డదారిలో వచ్చిన జేమ్స్‌ స్టీఫెన్‌కు కీలకమైన రిజిస్ట్రార్ పదవి కట్టబెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సుమారు వందేళ్ల యూనివర్సిటీ చరిత్రలోనే ఇదొక్క కళంకంగా భావిస్తున్నారు.

స్టీఫెన్‌ ఉత్తరాంధ్రలో కీలకమైన సుమారు 100కు పైగా చర్చిలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించే పాస్టర్లంతా ఆయన శిష్యులే.

ఆయా చర్చిల పరిధిలో గల ఓటర్లను అనుకూలంగా మలుస్తారనే ఉద్దేశంతోనే స్టీఫెన్‌కు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పెద్దల సహకారంతో ఏయూ ఉన్నతాధికారి పదవులు కట్టబెడుతున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతానికి అదనపు బాధ్యతలు అప్పగించినప్పటికీ త్వరలో పూర్తిస్థాయి రిజిస్ర్టార్‌గా నియమిస్తూ ఆదేశాలు వెలువడవచ్చునని చెబుతున్నారు.