Articles

మొగలులను ఎదిరించిన ధీరనారి ‘‘రాణి దుర్గావతి’’

288views

(అక్టోబరు 5 – రాణి దుర్గావతి జయంతి)

రాణి దుర్గావతి ధైర్య, సౌశీల్యాలకు పెట్టింది పేరు. ఆమె రాజపుత్ర రాకుమారి. 1524 అక్టోబరు 5న బుందేల్ఖండ్ రాజు కీరపాలిసింగ్‌కు కుమార్తెగా కలింజర్ కోటలో జన్మించింది, దుర్గావతి 1542 గరామాండ్గా పాలకుడైన సంగ్రామ్ షా జ్యేష్ఠ కుమారుడైన గోండీరాజు దల్పతిషాను వివాహమాడింది. వివాహానంతరం గోండ్లు అయిన దలపతిషా, దుర్గావతి బుందేల్ ఖండ్‌కు చెందిన చందేలా వంశీకులతో మైత్రి చేసుకొని 1545లో షేర్షా సూరి కలింజర్‌ను ముట్టడించినప్పుడు గట్టి ప్రతిఘటన నిచ్చారు. షేర్షా గెలిచినప్పటికీ ప్రమాదవశాత్తు జరిగిన తుపాకి మందు ప్రేలుడులో మరణించాడు. అదే సంవత్సరం దుర్గావతికి వీరనారాయణ్ అనే కుమారుడు జన్మించాడు. తరువాత ఐదేళ్ళకే 1550లో దల్పతిషా మరణించగా వీరనారాయణ్ పసివాడైనందున దుర్గావతి రాజ్యాధికారం చేపట్టింది.

రాణి దుర్గావతి 1550 నుండి 1564 వరకు గోండ్‌వానా రాజ్యమును పరిపాలించింది. ఆమె వ్యక్తిత్వంలో సౌందర్యము, రాజసము, అద్భుత విజయములు, నిస్వార్ధ వీరత్వము కలగలిసి ఉన్నాయి. ఆమె తన రాజ్యముపై మాళ్వరాజు బాజ్‌ బహద్దూర్‌ చేసిన దాడిని వీరోచితంగా ఎదుర్శొని, మొగలు చక్రవర్తుల సార్వభౌమత్వమునకు ఎదురొడ్డి నిలిచింది. మొఘలుల సైనికశక్తి ఎంతో అధికమని ఆమెకు దివాన్ చెప్పినా వాళ్ళకు లొంగి అవమానకరంగా జీవించడం కంటే గౌరవంగా మరణించడమే మంచిదని చెప్పింది. యుద్ధంలో ఆమె సేనాధిపతి అర్జున్దాస్ మరణించడంతో తానే స్వయంగా సేనలకు నేతృత్వం వహించాలని నిశ్చయించింది. శత్రువులు లోయలోకి ప్రవేశించగానే రాణి సైనికులు వారిపై దాడిచేశారు. ఇరుపక్షాల్లో కొందరు మరణించారు, ఈ యుద్ధంలో దుర్గావతి గెలిచింది. ఆమె మొఘల సైన్యాన్ని తరిమికొట్టింది.

దుర్గావతి రాజ్యంపై మళ్ళీ దాడిచేయాలని అసఫ్ఖాన్ 1564లో నిర్ణయించాడు. అచల్ పూర్ (మహారాష్ట్ర) వద్ద దాడిచేశాడు. రాణి తన సలహాదారులతో తన వ్యూహాన్ని సమీక్షించింది. రాత్రివేళ శత్రువులపై దాడి చేసి వాళ్ళను బలహీనపరుద్దామని ఆమె సూచిస్తే సలహాదారులు అంగీకరించలేదు. తెల్లవారే సరికి అసఫ్ఖాన్ పెద్ద తుపాకులు తెప్పించాడు. రాణి ఏనుగునెక్కి యుద్దానికి వచ్చింది. ఆమె కుమారుడు వీరనారాయణ్ కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. మూడుసార్లు మొఘల్ సేనను వెనక్కు నెట్టాడు. కాని చివరకు గాయపడ్డాడు. రాణికూడా బాణాలవల్ల గాయపడి స్పృహ కోల్పోయింది. స్పృహ తర్వాత ఓటమి తప్పదని గ్రహించింది. యుద్దరంగం విడిచి తప్పించుకోవలసిందిగా మావటివాడు సూచించాడు. కానీ ఆమె అందుకు అంగీకరించక ఒక చురకత్తితో తనను తాను పొడుచుకొని యుద్ధ రంగంలోనే మరణించింది. ఈ సంఘటన 1564 జూన్ 24న జరిగింది. సాహసోపేతురాలైన దుర్గావతి మొఘలుల మహాశక్తికి తలవంచే ఆలోచన ఎన్నడూ రానీయక తుదిశ్వాస వరకూ వారితో పోరాడింది.

రాణి దుర్గావతి సమాధి జబల్పూర్ లో ఉన్నది దీనికి సంబంధించిన శిలాశాసనంను ఇక్కడనే చూడవచ్చు. ఇక్కడకు వచ్చే పర్యాటకులందరూ ఈమె చరిత్రను గురించి తెలుసుకొని గౌరవంతో సమాధికి నమస్కరిస్తుంటారు. 1983 సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం జబల్పూర్ విశ్వవిద్యాలయాన్ని రాణీ దుర్గావతి విశ్వవిద్యాలయంగా నామకరణం చేసింది . భారత ప్రభుత్వం రాణి దుర్గావతి స్మారకంగా ఆమె పేరుతో 24 జూన్, 1988 తేదీన ఒక తపాలా బిళ్ళను విడుదలచేసింది. జబల్పూర్ మరియు జమ్మూతావీ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలుకు (11449/11450) దుర్గావతి అనే పేరు పెట్టారు.దుర్గావతి మానవ స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచి పోయిన ఒక వీర, ధీరవనిత.