News

40 సెంటీమీటర్లు ఎత్తుకు ఎగిరిన విక్రమ్ ల్యాండర్

340views

చంద్రుడి ఉపరితలంపై 14 రోజులపాటు గడ్డకట్టే చలిలో గడిపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు ఇక శాశ్వత నిద్రలోకి జారుకుంటున్నాయని భావిస్తున్న వేళ ఇస్రో తాజాగా మరో ప్రయోగం విజయవంతంగా చేపట్టింది. విక్రమ్ ల్యాండర్ లోని ఇంజన్లను మండించి కాస్తంత ఎత్తుకు ఎగిరేలా చేసి పక్కన దిగేలా చేశారు. భవిష్యత్తులో చంద్రుడిపై సేకరించే మట్టి, ఇతరత్రా శాంపిళ్లలను తిరిగి భూమి మీదకు తేవడానికి అక్కడి నుంచి వ్యోమనౌక టేకాఫ్ కావడం ముఖ్యం. అందులో భాగంగా సంబంధిత ప్రయోగాన్ని విక్రమ్ ల్యాండర్ తో చేశారు. ప్రస్తుతం అది ఉన్న శివశక్తి పాయింట్ నుంచి 40 సెంటీమీటర్లు ఎత్తుకు ఎగిరి తర్వాత 30 సెంటీమీటర్ల పక్కకు జరిగి సురక్షితంగా ల్యాండ్ అయింది.

“ఈ హాప్ ప్రక్రియ ముందుగా మా ప్లాన్లో లేదు. షెడ్యూల్లో లేకపోయినా ప్రయోగాత్మకంగా చేసి చూశాం. విజయం సాధించాం” అని చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. వీరముత్తువేల్ మీడియాకు వెల్లడించారు. చంద్రుడి దక్షిణ ధృవంలో పూర్తిగా చిమ్మచీకటి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే 14 రోజుల చంద్ర రాత్రి (లూనార్ నైట్) నుంచి మేలుకుని మళ్లీ కీలక ప్రయోగాలకు విక్రమ్, ప్రజ్ఞాన్లు సిద్ధం కాబోవనే సూచనలు కనిపిస్తున్నాయి. లూనార్ నైట్ ముగిసి సూర్యకాంతి ప్రసరించి ఇన్ని రోజులైనా ల్యాండర్, రోవర్ నుంచి ప్రతిస్పందనలు లేవు..