News

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన ఎంఐఎం ఎంపీలు

269views

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన్ బిల్లు(మహిళా రిజర్వేషన్ బిల్లు) లోక్‌సభలో మెజార్టీతో ఆమోదం పొందింది.

నూతన పార్లమెంట్ దిగువ సభ ఆమోదించిన తొలి బిల్లు ఇదే. ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు పోలయ్యాయి. లోక్‌సభలోని 545 మంది ఎంపీలకు గానూ 456 మంది సభకు హాజరై ఓటు వేశారు. అంతకు ముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేయగా.. ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్‌ను ప్రారంభించారు. ఓటేసిన 456 మంది లోక్‌సభ సభ్యులలో 454 మంది మద్దతుగా ఓటు వేయగా.. ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఆ ఇద్దరు ఎంపీలు ఎంఐఎం పార్టీకి చెందిన వారు కావడం గమనార్హం. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు ఔరంగాబాద్‌/ఛత్రపతి శంభాజీనగర్‌ ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌ వ్యతిరేకంగా ఓటు వేశారు.