News

దుర్గమ్మ ‘వెండి సింహాల’ చోరీ నిందితుడికి ఏడాది జైలు

211views

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో రథానికి ఉన్న మూడు వెండి సింహాల ప్రతిమలను దొంగిలించిన నిందితుడికి ఏడాది జైలు శిక్ష పడింది. సోమవారం విజయవాడ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ డి.సత్యవతి ఈ తీర్పును వెలువరించారు. 2020లో లాక్‌డౌన్‌ సమయంలో రథానికి ఉన్న నాలుగు వెండి సింహాల ప్రతిమల్లో మూడు మాయమయ్యాయి. ఆ ఏడాది సెప్టెంబరు 15వ తేదీన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి ఈవో సురేశ్‌బాబు ఇచ్చిన ఫిర్యాదుపై వన్‌టౌన్‌ పోలీసులు ఐపీసీ 379 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆలయాల్లో చోరీలు చేసే నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. పశ్చిమగోదావరి జిల్లా గొల్లవానితిప్ప గ్రామానికి చెందిన జక్కంపూడి సాయిబాబా అలియాస్‌ సాయిని 2021 జనవరి 22న అరెస్టు చేశారు. అతడిని విచారించి పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ముత్తా కమలే్‌షను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్ద 15.4 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కమలేష్‌ గోనె సంచిలో ఇనుపరాడ్డు పెట్టుకుని కాగితాలు ఏరుకునే వాడిలా ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించి వెండి సింహాల ప్రతిమలను దొంగిలించాడు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బి.కృష్ణకిషోర్‌ వాదనలు వినిపించారు. నేరం రుజువుకావడంతో కమలే్‌షకు ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.