News

గతేడాది ఒక్క రాయి దాడి కూడా లేదు.. జమ్మూకశ్మీర్‌పై రక్షణ శాఖ ఆసక్తికర నివేదిక..

0views

జమ్మూకశ్మీర్‌లో 2025 సంవత్సర భద్రతా పరిస్థితిపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కీలక గణాంకాలను వెల్లడించింది. రక్షణ మంత్రిత్వ శాఖ 2025-26 వార్షిక నివేదిక ప్రకారం, గతేడాది జమ్మూకశ్మీర్‌లో రాళ్లు రువ్విన ఘటనలు ఒక్కటి కూడా నమోదు కాలేదు. అదే సమయంలో స్థానిక యువతలో ఉగ్రవాద సంస్థల్లో చేరిన వారి సంఖ్య కేవలం ఒక్కరికి పడిపోయింది.

స్థానిక యువత ఉగ్రవాదంలో చేరే సంఖ్య గత కొన్నేళ్లుగా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 2021లో 146 మంది, 2022లో 121 మంది ఉగ్రవాదంలో చేరగా.. 2023లో ఈ సంఖ్య 19కి, 2024లో నాలుగుకు తగ్గింది. 2025లో మాత్రం ఒక్క స్థానిక యువకుడు మాత్రమే ఉగ్రవాదంలో చేరినట్లు నివేదిక పేర్కొంది. స్థానిక యువత హింస మార్గాన్ని వదిలి ప్రభుత్వ సంక్షేమ, ఉపాధి కార్యక్రమాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

జమ్మూకశ్మీర్‌లో గతంలో భద్రతా దళాలపై, నిరసనకారులు తరచుగా రాళ్ల దాడికి పాల్పడే వారు. అయితే గతేడాది మాత్రం అలాంటి ఘటన ఒక్కటి కూడా జరగలేదు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2010-14 మధ్య ఏటా సగటున సుమారు 2,654 రాళ్లు రువ్వే ఘటనలు నమోదయ్యేవి. 2022 తర్వాత ఇవి దాదాపు సున్నా స్థాయికి చేరుకున్నాయి. 2025లో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటుకు సంబంధించి ఆరు ప్రయత్నాలు జరిగినట్లు నివేదిక తెలిపింది. భద్రతా బలగాలు ఈ ప్రయత్నాలన్నింటినీ అడ్డుకున్నాయి. ఈ క్రమంలో 12 మంది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు హతమైనట్లు నివేదిక పేర్కొంది .

ఇక, జమ్ముకశ్మీర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్నట్టు కూడా తాజా నివేదిక వెల్లడించింది. 2025లో జమ్మూకశ్మీర్‌కు 2.3 కోట్ల మంది పర్యాటకులు వచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఇందులో 4.13 లక్షల మంది అమర్‌నాథ్ యాత్రికులు ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటికీ పర్యాటకుల సంఖ్య పెరగడం గమనార్హమని నివేదిక పేర్కొంది.