
” బ్రిటిషర్లు రాకముందు మన దేశంలో 70 శాతం మంది ప్రజలు చదువుకున్నవారే. ఆ సమయంలో దేశంలో నిరుద్యోగం కూడా లేదు. ఆ సమయంలో బ్రిటిన్‌లో చదువుకున్న వారి సంఖ్య కేవలం 17 శాతమే. బ్రిటిషర్లు భారత్ వచ్చి వారి విద్యావిధానం అమలు చేయడం ద్వారా భారత్‌ను నిరక్షరాస్య దేశంగా మార్చారు” అని మోహన్ భాగవత్ మండిపడ్డారు. ఢిల్లీలోని ఇంద్రి-కర్నాల్ రోడ్డులో నిర్మించిన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ”మన దేశంలో ఉన్న విద్యావ్యవస్థ కేవలం ఉపాధిని సంపాదించేదే కాదు. జ్ణానానికి మార్గం అది. ఇక్కడ విద్య అందరికీ అందుబాటులో ఉండేది, పైగా చాలా సులువుగా, తక్కువ ఖర్చుతో దొరికేది. అందుకే చదువుకు అయ్యే ఖర్చులన్నీ సమాజమే భరించేది. ఈ విద్యను అభ్యసించిన పండితులు, కళాకారులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు” అని భాగవత్ అన్నారు. ఇక సాధారణ ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు అందించేందుకు వీలుగా ఆసుపత్రి నిర్మాణం చేసిన ఆటం మనోహర్ ముని ఆశ్రంను ఆయన ప్రశంసించారు.దేశంలో విద్య, ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాల్సిన అంశాలని, ఇది వ్యాపారం కాకూడదని ఆయన అన్నారు. విద్య, ఉద్యోగాన్ని ప్రజలకు వీలైనంత తక్కువ ఖర్చుకు ప్రజలకు అత్యంత చేరువలో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. ఇక దేశంలోని మానవుల జీవితం తమ కోసం కాదని, అది పూర్తిగా ధర్మం కోసమని అన్నారు. ‘సర్వ జన హితాయ-సర్వజన సుఖాయ’ అని భాగవత్ నినదించారు.





