News

గోహంతకులు నరకానికి పోతారు

243views

గోవధపై నిషేధం విధించాలని, ఆవును రక్షిత జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్‌ హైకోర్టు లఖ్‌నవూ బెంచ్‌ కేంద్రాన్ని కోరింది. గోహంతకులు నరకానికి పోతారని వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్‌ గోహత్య నిరోధక చట్టం కింద ఆవును వధకు తరలించిన అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ షమీమ్‌ అహ్మద్‌ సింగిల్‌ బెంచ్‌ తోసిపుచ్చింది. పిటిషనర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ఖాలిక్‌.. ఎలాంటి ఆధారాలూ లేకుండానే పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, కాబట్టి అదనపు చీఫ్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో తనపై పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టుని కోరారు.

అయితే.. ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం.. రికార్డుల్లో ఉన్న వాస్తవ సమాచారం ఆధారంగానే పిటిషనర్‌పై ప్రాథమికంగా కేసు నమోదైందని అభిప్రాయపడింది. ‘మనం లౌకిక దేశంలో ఉంటున్నాం. హిందూ మతంతోపాటు అన్ని మతాల విశ్వాసాలనూ గౌరవించాలి. హిందూ మతంలో ఆవుని పవిత్రంగా, దేవుని ప్రతినిధిగా భావిస్తారు. కాబట్టి ఆవును సంరక్షించాలి’ అని జస్టిస్‌ షమీమ్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. గోవుని పూజించడం వేదకాలం నుంచీ ఉందని, రుగ్వేదంలోనూ ఆవుని వధించకూడదని ఉందని అన్నారు. గోహత్య పాపమని, ఆవులను చంపినా, లేదంటే గోవధను ప్రోత్సహించినా.. అలాంటి వాళ్లు తమ శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్నేళ్లపాటు నరకంలో శిక్ష అనుభవిస్తారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.