
అనంతరం పట్టణంలోని మొదటి రోడ్డులో ఉన్న కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం నిర్వహణ తీరుపట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవదాయ శాఖ అధికారులు ఈ ఆలయంలో సంప్రదాయాలకు, సనాతన ధర్మాలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. స్వామివారికి నివేదించే నైవేద్యాల తయారీ మొదలుకుని.. భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా స్వీకరించే ప్రసాదాల వరకూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉంది. 1923లో హోసూరు రామస్వామి ఈ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని దానం చేశారు. కాశీ నుంచి శివలింగాన్ని పాదయాత్రగా తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. జిల్లాలో ప్రతి శివరాత్రికి 11 రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించే ఆలయం ఇది ఒక్కటే. ఇలాంటి ఆలయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు భక్తులను కలచివేస్తున్నాయి.
నైవేద్యం తయారీలోనూ..
ఆలయంలో స్వామివార్లకు ప్రతి రోజూ సమర్పించే నైవేద్యాన్ని గతంలో ఆలయ ఆవరణలోని ప్రత్యేక గదిలో సంప్రదాయబద్ధంగా తయారు చేయించేవారు. ఈఓగా సుధారాణి బాధ్యతలు చేపట్టాక ఆ విధానానికి స్వస్తి పలికారు. నగరంలోని ఓ క్యాటరర్స్ వారి వద్ద వంటకాలను తెప్పించి స్వామివార్ల నైవేద్యానికి వినియోగిస్తున్నారు. ఇది తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించడం ఏమిటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దారుణంగా ఉంది..
మొదటి రోడ్డు కాశీ విశ్వేశ్వరస్వామిపై భక్తులకు చాలా విశ్వాసం ఉంది. దాదాపు 30 సంవత్సరాలుగా నేను ఈ ఆలయానికి వస్తున్నాను. ఇప్పుడున్న దుర్భర పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకం చేయిస్తుంటాం. అభిషేకానికి రూ.150 కట్టించుకుంటారు. అభిషేకం అయిన తర్వాత స్వామివారి ప్రసాదాన్ని ఇవ్వడం లేదు. ఉదయం 6 గంటలైనా ఆలయంలో ఎవరూ ఉండడం లేదు. ఆలయ నిర్వహణ చాలా దారుణంగా ఉంది.
– మోహనరావు, భక్తుడు
మెమో జారీ చేశాం…
ఈఓ సుధారాణి తీరుపై పలువురు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమే. రాష్ట్ర అధికారులకు సైతం ఫిర్యాదులు అందాయి. దీంతో ఆమెకు రాష్ట్ర కమిషనర్ మెమో జారీ చేశారు. ఆలయంలో సమస్యలను పరిష్కరించాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని ఈఓకు ఆదేశాలు జారీ చేశాం.
– రామాంజనేయులు, దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్
ఫిర్యాదు చేసినా…
మా పూర్వీకులు కట్టించిన ఈ ఆలయాన్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదు. నిత్యకైంకర్యాలతో స్వామివార్లు అలరారేవారు. అలాంటిది ఒక్కోసారి స్వామివారికి నైవేద్యం కూడా పెట్టని పరిస్థితి. ఆలయానికి వచ్చే భక్తుల సమస్యలు పట్టించుకునేవారే లేరు. ఈ విషయం గురించి ఈఓను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. తనకు రాజకీయ అండ ఉందని, ఎప్పుడైనా వస్తాను.. ఎపుడైనా వెళ్తాను.. అంటున్నారు. ఆమె తీరు గురించి జిల్లా, రాష్ట్ర అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశాం. అయినా వారు చర్యలు తీసుకోకపోవడం దారుణం. వందేళ్ల చరిత్ర కలిగిన ఆలయ ప్రతిష్ట దిగజారుతోందని బాధ కలుగుతోంది.
– హోసూరు రామసుబ్రహ్మణ్యం, ఆలయ అనువంశీకుడు
సోర్సు – ఏబీఎన్





