
ఉత్తరాంధ్ర ప్రజల ఆర్యాధ్య దేవత శ్రీ శంబర పోలమాంబ జాతర ఘనంగా ప్రారంభమైంది. విజయనగరం జిల్లా సాలూరు పరిధిలోని మక్కువ మండలం శంబరలో వెలసిన పోలమాంబ అమ్మవారి జాతర మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు. వేలాది మంది రాకతో శంబర గ్రామం కళకళలాడింది. పోలమాంబ నామస్మరణ మార్మోగింది. ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ మారు జాతరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించి పులకించిపోయారు. గోముఖీ నది తీరంలో పూజలు చేసి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. కాగా ఉదయం భక్తుల సంఖ్య స్పల్పంగా ఉండగా, 9 గంటలు దాటిన తరువాత రద్దీ పెరిగింది. వనం, చదురు గుడుల వద్ద క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. తొలుత భక్తజనం వనం గుడి వద్ద పోలమాంబ దర్శనం అనంతరం అమ్మవారు భూస్థాపితమైన చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ గుడి వద్ద కూడా కేశఖండన ఏర్పాట్లు చేయడంతో అత్యధికులు ఇక్కడే తలనీలాలు సమర్పించుకున్నారు. దేవదాయ శాఖాధికారులుక్యూలైన్లలోనే భక్తులకు తాగునీరు, ప్రసాదం, చిన్నారులకు పాలు ఉచితంగా అందించారు. మొత్తంగా మారు జాతరకు 50 వేల మందికి పైబడి భక్తులు తరలివచ్చినట్టు అంచనా. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు భద్రత విధులు నిర్వహించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.





