News

15 రోజుల్లో 25 వేల మంది హిందువులకు సభ్యత్వం… వీహెచ్‌పీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రమణ వెల్లడి

347views

కర్నూలు: “విశ్వహిందూ పరిషత్ హితచింతక ఉద్యమం”ను పురస్కరించుకొని కేవలం 15 రోజుల్లో 25 వేల మంది హిందూ బంధువులకు పరిషత్‌ సభ్యత్వం ఇవ్వనున్నట్టు కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ వెల్లడించారు. 200 గ్రామాలు, 110 నగర వార్డులకు చేరుకుని ఈ మహా వ్రతాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు.

ఇక్కడి విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యకర్తలు సమావేశంలో రమణ మాట్లాడారు. ఈ నెల ఆరోతేదీ(రేపు) ఆదివారం నుంచి ప్రారంభమై 20వ తేదీనాటికి ఈ కార్యక్రమం ముగుస్తుందని చెప్పారు. 2024 నాటికి విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 ఏళ్ళు పూర్తవుతాయని, షష్టిపూర్తి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ వ్రతం విజయవంతం అయ్యేందుకు సమాజంలోని ప్రతి కులం, మతం, వర్గాలను కలుస్తామని, వారిని హిందూ సమాజం, జాతీయ ప్రయోజనాలతో అనుసంధానిస్తామన్నారు. ఇందులోభాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా కలిసి, పరిషత్‌ కార్యక్రమాలను వివరిస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు అవుతాయన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, లాయర్లు, మాజీ జడ్జీలు, గాయకులు, నటులు, క్రీడాకారులు ఈ ప్రముఖుల జాబితాలోకి వస్తారన్నారు.

స్వచ్ఛందంగా ముందుకొచ్చిన 2000 మంది కార్యకర్తలు

పరిషత్‌ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ లక్కిరెడ్డి అమరసింహా రెడ్డి మాట్లాడుతూ హిత చింతక్ అభియాన్‌లో సుమారు 2000 వేల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొననున్నారని తెలిపారు. అశేష హిందూ సమాజానికి విశ్వహిందూ పరిషత్ పనులు, లక్ష్యాలను గురించి సవివరమైన సమాచారం పంపిణీ చేస్తామని, ప్రజా సేవ కోసం విశ్వహిందూ పరిషత్ పనిచేస్తోందని వివరిస్తామన్నారు. అణగారిన సమాజాన్ని సేవా కార్యక్రమాలతో అనుసంధానం వంటి కార్యక్రమాలను వివరిస్తామని చెప్పారు.

నగర అధ్యక్షుడు టీసీ మద్దిలేటి మాట్లాడుతూ సనాతన ఆచారాలను కొత్త తరానికి అందించడం, గోవుల రక్షణ, సామాజిక సామరస్యం, మహిళా సాధికారత, కుటుంబ ప్రభోదనo, పర్యావరణ పరిరక్షణ, మఠాలు, దేవాలయాల సక్రమమైన నిర్వహణతో పాటు హిందూ సమాజాన్ని సువ్యవస్థీకృతం చేయడం, రక్షించడం వంటి సంకల్ప స్ఫూర్తిని పెంపొందించడం కూడా ప్రచారంలో ఓ భాగమని చెప్పారు. మతమార్పిడులు, లవ్ జిహాద్‌లను అరికట్టేందుకు విశ్వ హిందూ పరిషత్ ఎలా కట్టుబడి ఉందో, తిరిగి స్వధర్మానికి తిరిగి తీసుకువచ్చే సమాచారం కూడా పంపిణీ చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు సందడి మహేష్, గూడా సుబ్రహ్మణ్యం, హితచింతక్ అభియాన్ జిల్లా ప్రముఖ్ ఎ.శ్రీనివాసరెడ్డి, విభాగ్ బజరంగ్ దళ్ కన్వీనర్ నీలి నరసింహ, నగర ఉపాధ్యక్షుడు శివపురం నాగరాజు, కార్యదర్శి ఈపూరి నాగరాజు, నగర బజరంగ్ దళ్ కన్వీనర్ భగీరథ, రామాలయ ప్రఖంఢ కార్యదర్శి గిరిబాబు, బజరంగ్ దళ్ కన్వీనర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభియాన్‌కు సంబంధించిన కరపత్రాలు, రశీదు పుస్తకాలను పరిషత్‌ నేతలు ఆవిష్కరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి