“మోడీని పొగుడుతావా? నీ అంతు చూస్తాం.” మాజీ ఇస్రో చీఫ్ మాధవన్ నాయర్ కు జైషే మొహమ్మద్ బెదిరింపులు.

మాజీ ఇస్రో చైర్మన్ మరియు భాజపా నాయకుడు డాక్టర్ మాధవన్ నాయర్ ప్రాణాలు తీస్తామంటూ జైషే మొహమ్మద్ పేరుతో బెదిరింపు లేఖ అందింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు తిరువనంతపురం, శాస్తమంగళంలోని డాక్టర్ మాధవన్ నివాసం నుంచి ఆ లేఖను స్వాధీనం చేసుకుని దర్యాప్తు సంస్థలకు అప్పగించారు.
డాక్టర్ నాయర్ ఆర్గనైజర్ పత్రికతో మాట్లాడుతూ లేఖ వచ్చిన విషయాన్ని ధృవీకరించారు. అయితే ఆ లేఖను తాను చదవలేదని, భద్రతా సిబ్బంది దానిని నేరుగా దర్యాప్తు అధికారులకు అందజేశారని తెలిపారు. దర్యాప్తు అధికారులు కూడా తనను సంప్రదించారని, కానీ లేఖలోని పూర్తి వివరాలను తనకు తెలుపలేదని పేర్కొన్నారు.
పోలీసు వర్గాల సమాచారం మేరకు జైషే మొహమ్మద్ పేరుతో వచ్చిన లేఖలో డాక్టర్ మాధవన్ నాయర్ ప్రధాని నరేంద్ర మోడీని పొగడడం ఆపకపోతే ఆయనను చంపేస్తామని పేర్కొన్నారు. అదే రోజు డాక్టర్ మాధవన్ నాయర్ మిషన్ శక్తి పేరుతో అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించబడిన యాంటి శాటిలైట్ మిస్సైల్ ప్రయోగం విషయమై ప్రధాని నరేంద్ర మోడీని శ్లాఘించటం గమనార్హం.
మాజీ ఇస్రో చైర్మన్ అయిన డాక్టర్ మాధవన్ నాయర్ మిషన్ శక్తి అవసరమని గతంలో తాము సూచించినా అప్పటి యు.పి.ఎ ప్రభుత్వం అలాంటి సాహసం చెయ్యలేకపోయిందని, కానీ ఇప్పుడు ప్రధాని మోడీ పూర్తి సహకారాన్ని అందించి మిషన్ విజయవంతంగా పూర్తి చేశారని ప్రధాని మోడీని ప్రస్తుతించారు.
కాగా లేఖపై రహస్య బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. మ్యూజియం పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఘటనపై దర్యాప్తు బృందాలు పోలీసులకు ప్రాధమిక సమాచారం అందించాయి. అక్టోబర్ 31, 1943లో జన్మించిన డాక్టర్ నాయర్ 2003 నుంచి 2009 వరకు ఇస్రో చైర్మన్ గా పనిచేశారు. ప్రధాని మోడీ పనితీరును ప్రస్తుతిస్తూ ఆయన గత సంవత్సరం BJPలో చేరారు.





