News

చౌకగా ఆలయ భూమి అప్పగింతకు అధికారుల య‌త్నాలు!

454views

వైఎస్‌ఆర్‌ జిల్లా: అక్కడ ఆలయ భూమిని ఆక్రమించి ఇళ్ళు నిర్మించుకున్నారు. ఇపుడు దాని విలువ ఎక్కువగా ఉంది. ఆక్రమణదారులకు మేలు చేసేందుకు వీలుగా.. అధికారులు ఆ ఆలయానికి ప్రత్యామ్నాయ భూమిని ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇందుకు కబ్జాలో ఉన్న భూమి విలువను అతి తక్కువగా చూపించారు. ఇది ఏపీలోని వైఎస్‌ఆర్‌ జిల్లాలోని సీఎం జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని వేంపల్లికి దగ్గరలోని కత్తులూరులో ఉన్న గంగమ్మ దేవస్థానం భూముల విషయంలో జరుగుతున్న తంతు.

ఈ ఆలయానికి నందిపల్లిలోని కడప-పులివెందుల నాలుగు వరుసల రహదారికి ఇరువైపులా కలిపి సర్వే నంబరు 514, 540లలో ప్రస్తుతం 9.63 ఎకరాలు ఉంది. ఇది వేంపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉండటం, ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో.. ప్రస్తుతం ఇక్కడ ఎకరా మార్కెట్‌ విలువ రూ.కోటి వరకు ఉంటుందని చెబుతున్నారు. అయితే అధికారులు దీనికి అతి తక్కువ విలువ కట్టారు.

ఆక్రమణలో ఉన్న 5.19 ఎకరాలను వేలం ద్వారా విక్రయించాలని దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ రెండేళ్ళ కింద‌ట ప్రతిపాదన పంపినప్పుడు.. సబ్‌ రిజిస్ట్రార్ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం ఎకరా రూ.18.39 లక్షలని, మార్కెట్‌ విలువ రూ.22 లక్షలపైనే ఉందని అందులో పేర్కొన్నారు. అంటే ఆ లెక్కన 5.19 ఎకరాలకు సబ్ రిజిస్ట్రార్‌ ధర ప్రకారం రూ.95.44 లక్షలు, మార్కెట్‌ విలువ రూ.22 లక్షల ప్రకారం రూ.1.14 కోట్లు అవుతుంది. కానీ ప్రస్తుత అధికారుల కమిటీ రూ.16.92 లక్షలే అని పేర్కొనడం గమనార్హం.

ప్రస్తుతం అక్కడ ఎకరా కోటి వరకు ధర ఉందని, అధికారులు కావాలనే చౌకగా చూపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ దస్త్రం ఇప్పటికే దేవాదాయశాఖ ఉన్నతాధికారులవద్దకు వచ్చినట్టు సమాచారం. దీని ఆమోదం కోసం రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. గతవారం కలెక్టర్‌ ఈ ఆలయానికి ప్రత్యామ్నాయ భూమి ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ అంశంపై దేవాదాయశాఖ ఇన్‌ఛార్జ్‌ ఉపకమిషనర్‌ (కర్నూలు) రాణాప్రతాప్‌ను వివరణ కోరగా.. అటువంటి ప్రతిపాదన ఏమీలేదని పేర్కొనడం కొసమెరుపు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి