
సర్ సి.వి.రామన్ (చంద్రశేఖర్ వెంకటరామన్) 1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచునాపల్లిలో జన్మించారు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఎ చదివి 19 సంవత్సరాల వయస్సులోనే ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ సభ్యుడయ్యాడు. కొల్‌కతా ఫైనాన్స్ మినిస్ట్రీలో నిర్వహణా విభాగంలో ఉద్యోగం చేస్తూ సహజమైన ప్రవృత్తి కనుగుణంగా స్వయంకృషితో గంటల తరబడి పరిశోధనలు చేసేవాడు. 18 ఏళ్ళ వయస్సులో “కాంతి” అనే అంశంమీద ఈయన వ్రాసిన పరిశోధనా వ్యాసం లండన్ నుండి వెలువడే “ఫిలసాఫికల్ మ్యాగజైన్” లో ముద్రితమైంది. అహోరాత్రాలు కృషిచేసి సాధారణ కాంతికిరణం ద్రవ్యం గుండా ప్రసారమయ్యేటప్పుడు కలిగే ప్రభావాన్ని కనిపెట్టి భౌతిక శాస్త్రవేత్తలనే దిగ్ర్భాంతికి గురిచేశాడు. ఆ పరిశోధనే ‘రామన్ ఎఫెక్ట్”గా ప్రపంచ ప్రఖ్యాతి చెంది 1930లో ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని సాధించిపెట్టింది. రామన్ కనిపెట్టిన ఈ రామన్ ఎఫెక్ట్ ద్వారా ఈనాడు భౌతికశాస్త్ర ప్రపంచంలోనే “స్పెక్ట్రోస్కోపీ” అనే ఒక పెద్ద విభాగమే రూపుదిద్దుకుంది. సముద్రం నీలంగా ఉండటానికి, గులాబీ పువ్వు రంగురంగుల్లో ఉండటానికి, వజ్రాలు వింతవింత కాంతులీనడానికి, పదార్థాల ధర్మాలు ఊహాతీతంగా మారిపోవడానికి గల కారణాలను ఈ రామన్ ఎఫెక్ట్ వివరించగలుగుతోంది. ఈ సూత్రం ఆధారంగా రెండువేల రసాయన మిశ్రమాల అంతర్గత నిర్మాణాలను శాస్త్రజ్ఞులు కనుగొనగలిగారు.
ఎన్నో పరిశోధనలను చేసిన సి.వి.రామన్ “విజ్ఞానశాస్త్ర సారాంశం ప్రయోగశాల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశ్రమ, స్వతంత్ర ఆలోచనా ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మథించివేస్తాయి” అని అన్న మాటలు ఎందరినో కదిలిస్తాయి, ఆలోచింపచేస్తాయి. రామన్ “సైన్స్ అసోసియేషన్” కార్యదర్శిగా ఉండినారు. లండన్ రాయల్ సొసైటీలో ఫెలోషిప్ ను పొందారు. బెంగుళూరులో రామన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించి యువశాస్త్రవేత్తలకు ప్రోత్సాహాన్నిచ్చారు.
రామన్ కు ఏర్పాటుచేసిన అభినందన సభలో మిత్రులందరూ అతనికి ఆల్కహాలు గ్లాసును అందించి త్రాగమని ఒత్తిడి చేస్తూ రామన్ పై ఆల్కహాలు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాం అని అంటే రామన్ ఆ గ్లాసును అందుకుని పక్కనబెడుతూ రామన్ పై దాని ఎఫెక్ట్ ఏ మాత్రం లేదని చిరునవ్వుతో సమాధానమిచ్చి తన వ్యక్తిగత శీలాన్ని ప్రకటించుకున్నారు. తన విద్యార్థులకు ఆయన “విదేశీ శాస్త్రవేత్తల మాటలు నిజమని నిరూపింపబడేవరకు వారి వెంటబడటానికి వెంపరలాడకండి” (Do not go by the words of the foreigners till their truth is proved) అని సలహా ఇచ్చేవారు. ఈ మాటలు ఆయనకు గల ఆత్మగౌరవానికి, దేశభక్తికి సంకేతాలు.
- నేడు సర్ సి.వి.రామన్ జయంతి –





