
ఈనెల 20 నుంచి కొన్ని రంగాలకు లాక్ డౌన్ మినహాయింపులు లభిస్తుండటంతో.. మొత్తం దేశాన్ని 3 కేటగిరీలుగా విభజిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రోజువారీ బ్రీఫింగ్ లో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ చీఫ్ సైంటిస్ట్ గంగా ఖేడ్కర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ కేసుల వివరాలతోపాటు పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఏపీలో 11 జిల్లాలు…
కేసుల తీవ్రత, వైరస్ విస్తరిస్తున్న తీరును బట్టి ఏపీలో బాగా ఎఫెక్ట్ అయిన గుంటూరుతోపాటు కర్నూలు, నెల్లురు, ప్రకాశం, కృష్ణా, కడప, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, అనంతపురం జిల్లాలను హాట్ స్పాట్లుగా గుర్తించారు.
తెలంగాణలో….
హాట్ స్పాట్లుగా కేంద్రం గుర్తించిన 170 జిల్లాల్లో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ అర్బన్, జోగులాంబ గద్వాల, మేడ్చల్, మల్కాజ్ గిరి, కరీంనగర్, నిర్మల్, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. కేంద్రం సూచనను బట్టి, ఈనెల 20 నుంచి లాక్ డౌన్ సడలింపులు ఈ జిల్లాలకు వర్తించబోదు. అయితే తగిన జాగ్రత్తలతో వ్యవసాయ పనులకు కొంత వెసులుబాటు లభించే అవకాశముంది.
దేశం మొత్తమ్మీద 170…..
మనదేశంలో మొత్తం 736 జిల్లాలు ఉండగా, వైరస్ వ్యాప్తి, కేసుల నమోదు, వాటి తీవ్రతను దృష్ట్యా వాటిని మూడు కేటగిరీలుగా విభజించామని, వాటిని హాట్ స్పాట్ జిల్లాలు, నాన్ హాట్ స్పాట్ జిల్లాలు, గ్రీన్ జోన్ జిల్లాలుగా పరిగణిస్తామని అగర్వాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా 170 జిల్లాలను హాట్ స్పాట్స్ గా, మరో 207 జిల్లాల్ని నాన్ హాట్ స్పాట్స్(తీవ్రత తక్కువ ఉన్నవి)గా గుర్తించామని చెప్పారు. ఇవిపోను మిగిలిన 359 జిల్లాలు గ్రీన్ జోన్లుగా ఉంటాయన్నారు. కాగా, 20 నుంచి అమల్లోకి వచ్చే సడలింపులు హాట్ స్పాట్ జిల్లాలకు వర్తించబోవని ఆయన స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా పెరిగిన కేసులు..
కరోనా వైరస్ విజృంభణ మొదలైన తర్వాత.. గడిచిన 24 గంటల్లోనే కొత్త కేసుల నమోదు రికార్డు స్థాయిలో జరిగిందని కేంద్ర అధికారులు చెప్పారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం దాకా కొత్తగా 1173 కేసులు వచ్చాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,933కు, మరణాల సంఖ్య 392కు పెరిగిందని తెలిపారు. 11.4 శాతం రికవరీరేటుతో ఇప్పటిదాకా కొవిడ్-19 నుంచి 1,343 మంది బయటపడ్డారన్నారు.