
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ భూముల్లో ఎటువంటి యాజమాన్య పత్రాలు లేకుండా కొనసాగుతున్న మసీదులు, దర్గాలు, చర్చిల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆయా ప్రార్థనా స్థలాలకు భూమి యాజమాన్య హక్కులు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఏ.ఎం. షాజహాన్ వెల్లడించారు.
ఈ అంశాన్ని రెవెన్యూ శాఖ మంత్రి కె. సెంగోట్టయ్యన్ దృష్టికి తీసుకెళ్లినట్లు షాజహాన్ తెలిపారు. దీనిపై స్పందించిన రెవెన్యూ మంత్రి.. సంబంధిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించి, నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగిన మతపరమైన సంస్థలకు పట్టాలు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ భూముల్లో గత 25 నుంచి 50 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రార్థనా స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించాలని ముస్లిం, క్రైస్తవ వర్గాల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందినట్లు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ ప్రతిపాదనకు సంబంధించిన తుది విధివిధానాలు, అర్హత ప్రమాణాలు ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు.
మరోవైపు, తమిళనాడులో అనుమతులు, భూమి హక్కులకు సంబంధించిన మతపరమైన నిర్మాణాల వివాదాలు గతంలోనూ న్యాయస్థానాల దృష్టికి వెళ్లాయి. 2026 జూన్లో కోయంబత్తూరులో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన మారియమ్మన్ ఆలయానికి సమీపంలో ప్రతిపాదించిన చర్చి నిర్మాణంపై మద్రాసు హైకోర్టు మధ్యంతర ఆంక్షలు విధించింది.
2024 ఫిబ్రవరిలో చెన్నైలోని కోయంబేడు ప్రాంతంలో ప్రభుత్వ భూమిపై నిర్మించిన మసీదు, మదర్సా కూల్చివేతకు సంబంధించి మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ భూమిపై అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, సంబంధిత నిర్మాణాల తొలగింపునకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది.
తాజా ప్రతిపాదనపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఏ. అశ్వత్థామన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మసీదులు, చర్చిలకు పట్టాలు ఇచ్చే ప్రతిపాదనలో హిందూ ఆలయాల విషయంలోనూ సమాన వైఖరి అవలంబించాలని డిమాండ్ చేశారు. దేవాలయాలకు సంబంధించిన భూముల విషయంలోనూ ఇదే తరహా పరిశీలన జరగాలని కోరారు.
ప్రభుత్వ భూముల్లో కొనసాగుతున్న మతపరమైన నిర్మాణాల క్రమబద్ధీకరణ అంశం ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తుంది? అర్హతలను ఎలా నిర్ణయిస్తుంది? అన్ని మతాల ప్రార్థనా స్థలాల విషయంలో సమాన ప్రమాణాలు పాటిస్తుందా? అన్నది వేచి చూడాలి.





