ArticlesNews

మానవ జీవితానికి లక్ష్యమేమిటి ?

770views

లిస్ అనే చిన్న పిల్ల సంత రద్దీలో తల్లి నుంచి విడిపోతుంది. కంగారుగా అటూ ఇటూ చూసుకుంటూ ఒక నిర్మానుష్యమైన బాట మీదకు వస్తుంది. “నేను ఇంటికి ఎలా వెళగలను? అమ్మనెలా చూడగలను?” అని ఏడుపు లంకించుకొంటుంది. ఇంతలో ఒక పిల్లి ఎదురుగా వస్తుంది. “పిల్లీ ! పిల్లీ! మా ఇంటికి దారి చెప్పు?” అని అడుగగా, ఆ పిల్లి ఇలా అంటుంది. “మీ ఇంటి ఎడ్రసు చెప్పగలవా ? అడ్రసు చెబితే మీ ఇంటకి దారి సరిగ్గా చెప్పేస్తాను.” “అక్కడే వచ్చింది, చిక్కు. నాకు మా ఇంటి అడ్రసు తెలియదు.” అంటుంది ఏలీస్. “నీ ఇంటి అడ్రసు నీకే తెలియక పోతే, అక్కడకు వెళ్లే దారి నీకు నేనెలా చూపించగలను ?” అంటుంది ఆ పిల్లి. ప్రపంచంలో చాలా మందికి “మన గమ్యమేమిటి ? ” అనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండదు. అని ఈ కథలోని అంతరార్థం. చాలామందికి తమ అంతిమ లక్ష్యం గురించి అవగాహన లేదు. పరుగులు తీయడమైతే జరుగుతోంది. కానీ చేరుకోవలసినది ఎక్కడికో తెలియదు.

మానవ జీవితపు అంతిమ గమ్యం ఏమిటి, ఆ లక్ష్యం యొక్క ప్రేరణ మనుషులపై ఏ విధంగా ఉంటుంది, అని ఆలోచించిన మహానీయులు చాలా సిద్ధాంతాలు చెప్పారు. వాళ్ళని స్థూలంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఒకటి భౌతిక వాదులు, రెండు అభౌతిక వాదులు” నేను “ఆధ్యాత్మిక వాదులు” అనే మాటని ఇక్కడ ఉపయోగించటం లేదు. ఎందుకంటే భౌతిక వాదులలో చేరని వారందరూ ఆధ్యాత్మిక వాదులు కారు.

ఈ రెండు దృక్కోణాలను జోడిస్తే మానవులేకాక సమస్త జీవరాశుల జీవన లక్ష్యాలూ శ్వతంగా నిశ్చితమైపోతాయి. ప్రాచీన ఋషులు, మునులు, మహర్షులు, తత్త్వజ్ఞులు ఏ జీవన లక్ష్యాలను పేర్కొన్నారో వాటినే నేటి సంస్కర్తలు, ప్రగతి కాముకులు, విప్లవ కారులు, వ్యక్తి స్వాతంత్ర్య వాదులు కూడా చెబుతున్నారు. వీరందరి సిద్ధాంతాలకు ఒకటే మూల సూత్రం.

“జీవిత లక్ష్యం సుఖంగా ఉండడమే” అనేదే ఆ సూత్రం. అందరి జీవన యాత్ర ‘సుఖం’ అనే దాని దిశగానే సాగిపోతోంది. ప్రాచీన కాలపు ఋషులు, ఆధునిక కాలపు  హిప్పీలు ఇరు వర్గాలలోనూ ఒకటే ఆకాంక్ష. వాళ్లందరూ కూడా సుఖం యొక్క అన్వేషణలోనే ఉన్నారు. వాళ్ల మార్గాలు మాత్రమే భిన్నమైనవి. ఎందుకంటే సుఖం అనే దాని గురించి వారికి గల అభిప్రాయాలు భిన్నమైనవి. ప్రపంచంలో ఎక్కడా కూడా దుఃఖాన్ని కోరి వరించే వ్యక్తి లేడు. కానీ ప్రతి ఒక్కరికీ సుఖం’ అంటే అభిప్రాయం వేఱువేఱుగా ఉన్నందువల్ల ఫలానా మార్గం మంచిదా, లేక మరొక మార్గం మంచిదా అనే అభిప్రాయభేదాలు ఏర్పడుతున్నాయి.

పాశ్చాత్య మేధావుల ఆలోచనలు మొత్తం మీద భౌతిక వాదపరమైనవి, ఇహలోక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నవి. భౌతిక వాదులు మన దేశంలో లేరని గానీ, పాశ్యాత్య దేశాలలో మాత్రమే ఉన్నారని గానీ దీని అర్థం కాదు. నిజానికి ఇహలోక వాదానికి చెందిన తత్త్వసిద్ధాంతపు పుట్టుక భారతదేశంలోనే జరిగింది. యూరప్ లో రెండు వేల సంవత్సరాలకు ముందు గ్రీకు తత్వవేత్త డెమోక్రటిస్ భౌతికవాద సిద్ధాంతాన్ని ప్రారంభించాడు. అంతకు కొన్ని వేల సంవత్సరాలకు ముందే మన దేశంలో బృహస్పతి “అసతో సత్ అజాయత” (అనాస్తిత్వంలోంచి అస్తిత్వం ఉద్భవించింది) అన్న సూత్రాన్ని చెప్పాడు. దీనినే నేడు పాశ్చాత్యులు భౌతిక వాదానికి ఆద్య సూత్రంగా పరిగణిస్తున్నారు. సృష్టి యొక్క నిర్మాణం చైతన్య రూపమైన ఆత్మతత్వం వల్ల జరగలేదని, అటువంటి కారణమేదీ లేకుండానే సృష్టి ఆరంభమైందని దీని భావం. కనుక మనవద్ద కూడా భౌతిక వాదం ఉంది. పాశ్చాత్య భౌతిక వాదులు చెప్పిన విధంగానే మన భౌతిక వాదులూ చెప్పారు. మనదేశంలో భౌతిక వాదులలో చివరి వాడుగా చార్వాకుడిని పరిగణిస్తారు.

ఎలాంటి జీవితం జీవించాలో ఆయన ఈ విధంగా చెప్పాడు.

యావజ్జీవం సుఖం జీవేత్, ఋణం కృత్వా ఘృతం పిబేత్

భస్మీ భూతస్య దేహస్య పునరాగమనం కుతః ?

బ్రతికి ఉన్నన్నాళ్ళు సుఖంగా బ్రతకాలి. “అప్పుచేసి నెయ్యి వేసి పప్పు భోజనం చేయాలి, చచ్చిపోయి దహనం అయ్యాక ఈ దేహానికి తిరిగి వచ్చే అవకాశం లేదు కదా?” ఇదీ దీని భావం. భారతీయుడు కనుక సుఖజీవనానికి ప్రతీకగా నేతితో భుజించడాన్నే చెప్పాడుగాని సారా తాగడాన్ని చెప్పలేదు. అయితే “తిని, త్రాగు, సుఖపడు” అన్నది చార్వాకుడు సారాంశం కూడా. దీన్నే “వినియోగ వాదం” అనీ అనవచ్చు.

“సుఖం అంటే భోగమే” అనే సిద్ధాంతాన్ని ప్రవచించిన వాళ్లలో ఉమర్ ఖయ్యాం శ్రేష్ఠుడు, నిజానికి ఉమర్ ఖయ్యాం వ్రాసిన రుబాయిలు నీచ స్థాయికి చెందినవి కావు. వాటిలో ఉన్నతమైన తాత్త్విక భావనలు చాలా ఉన్నాయి. అతని రుబాయీలను చదువురాని వారు, విద్యావంతులైన చింతన శీలురు కూడా ఆసక్తిగా పఠిస్తారు. పాడుకుంటారు. ఖయ్యాం కేవలం భోగానుభవాన్నే ప్రబోధించాడనే పొరపాటు అభిప్రాయం లోకంలో ఏర్పడింది. కానీ భోగానుభవం గురించి చెబుతూనే అతను ఇలా అంటాడు, “గులాబి పుష్పం వాడి పోయినట్లుగా వసంతమే గడిచిపోతుంది. పరిమళ భరితమైన యౌవనమూ గడిచిపోతుంది. తియ్యగా పాడే బుల్ బుల్ పిట్ట ఈ పొదరింటిలోకి ఎలా వస్తుందో ఎలా వెళ్లిపోతుందో ఎవరికీ తెలియదు. ఓ సాఖీ ఖయ్యాంతో కలిసిరా! తెలివి గల వారిని మాట్లాడుకుంటూ ఉండనియ్యి. జీవితం గడిచి పోతుందనేది తథ్యం. మిగిలిన అన్ని విషయాలూ అబద్దమనేది తథ్యం

పోకలు పూచుచున్నపుడె, పోకల తమ్ములపాకు తీగియల్

ప్రాకుచు బ్రాకుచున్నపుడే, పై పయి వచ్చి లవంగ వాయువుల్

సోకుచు సోకుచున్నపుడే, సుందరి ఈ లవలీ నికుంజమం

దేకత ముండి యిందు సుఖియింతము. రేపటి మాట కేమిలే ?

(మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి గారిచే తెలుగులోకి అనువదింపబడినది.)

తాత్కాలిక సుఖానుభవాన్ని గురించి ఇంత సుందరమైన వర్ణన బహుశా మరెక్కడా లేదేమో. లోతుగా ఆలోచించలేని వారికి ఇది గట్టిగానే నాటుకుంటుంది, ప్రభావితం చేస్తుంది కూడా. మనుష్యుల యొక్క ఆలోచన ఇంత మాత్రంగానే ఉంటుంది. భౌతిక వాదులు చెప్పేదేమిటంటే “భోగానుభవం నుంచే సౌఖ్యం లభిస్తుంది”, అని. జిహ్వ అనేది ఇంద్రియం. రసగుల్లా అనేది విషయం. రెండూ కలిస్తే కలిగేది ఆనందం. చెవి ఇంద్రియం. లతామంగేష్కర్ పాట విషయం.  రెండూ కలిస్తే ఆనందం. కన్ను “ఇంద్రియం, కాశ్మీర్ లోయ విషయం, రెండూ కలిస్తే ఆనందం. కనుక ఇంద్రియాలు చెప్పినట్లు నడుచుకో. ఇంద్రియాలు ఎంత తృప్తి పడితే అంత సౌఖ్యాన్ని పొందుతావు”. అని భౌతిక వాదులు చెబుతారు. షోపెన్ అనే పెద్ద మనిషి సుఖం గురించి ఏకంగా ఒక సమీకరణం తయారు చేసి పెట్టారు

 

తీరిన కోరికలు

————–       =          సుఖం యొక్క పరిమాణం

కలిగిన కోరికలు

మనసులో పుట్టిన కోరికలలో ఎన్ని నెరవేరాయి అన్నదాన్ని బట్టి సుఖం యొక్క కొలమానం ఉంటుందన్న మాట.

ఈ గణన ప్రకారం సౌఖ్యం ఎన్నటికీ పూర్ణాంకం కాలేదు. ఒకటి కన్నా తక్కువ విలువ గలదిగానే ఉంటుంది. దానిని పూర్ణాంకం చెయ్యాలంటే కలిగే కోరికలనైనా తగ్గించుకోవాలి, లేదా తీరిన కోరికలనైనా పెంచుకోవాలి. ఈ సూత్రంలో ‘సౌఖ్యం’ అనే పదానికి అర్థం శరీర సౌఖ్యం అనే.

………….ఇంకా ఉంది

(శ్రీ దత్తోపంత్ ఠేంగ్డేజీ ‘కార్యకర్త’ పుస్తకం నుంచి.)

 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.