News

వీళ్ళసలు మనుషులేనా?

179views

కవైపు కొవిడ్‌-19 మహమ్మారిని నివారించేందుకు ప్రభుత్వం, వైద్య సిబ్బందితో పాటు ఆరోగ్య కార్యకర్తలు శ్రమిస్తుంటే వారిపై కరోనావైరస్‌ సోకినవారు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో ఇద్దరు కరోనాబాధితులు వారిని పర్యవేక్షిస్తున్న నర్సులు, ఆరోగ్యకార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తి ఇటీవలే మస్కట్‌ నుంచి తన సొంతగ్రామానికి వచ్చాడు. ప్రభుత్వాలు సూచిస్తున్న విధంగా స్వీయనిర్బంధంలో ఉండకుండా రోడ్లపై తిరుగుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అతడిని సమీపంలోని కరోనా కేసుల పర్యవేక్షణ కేంద్రంలో ఉంచారు. ఈ క్రమంలో తనకు టీ కావాలని అక్కడి నర్సును అడిగాడు. ఆమె అతని కుటుంబసభ్యులకు చరవాణి ద్వారా సమాచారం అందించింది. వాళ్లు టీ తీసుకురావటం ఆలస్యమవడంతో అక్కడే ఉన్న నర్సును దుర్భాషలాడుతూ ఆమెపై భౌతికంగా దాడి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతనిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి తిరువనంతపురం వైద్య కళాశాలకు తరలించారు.

మరో కేసులో 27ఏళ్ల యువకుడు కొన్నిరోజుల క్రితం గల్ఫ్‌ దేశాల నుంచి గ్రామానికి వచ్చాడు. దీన్ని గమనించిన ఆశావర్కర్‌ విషయాన్ని సంబంధింత వైద్యశాఖకు తెలిపింది. దీంతో సదరు యువకుడు రెచ్చిపోయి తన గురించి ఎందుకు చెప్పావంటూ..ఆమె ఇంటికి వచ్చి మరీ దాడిచేశాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడి బిగ్గరగా ఏడుస్తుండగా స్థానికులు కాపాడారు. పోలీసులకు సమాచారం అందించగా అతనిపై కేసు నమోదు చేశారు. ఆశాకార్యకర్త ఫిర్యాదు మేరకు అతనిపై హత్యాప్రయత్నం కేసు నమోదు చేశారు. సదరు ఆశాకార్యకర్త గత రెండు వారాలుగా విరామం లేకుండా కరోనా నివారణ చర్యలలో పాల్గొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.