ArticlesNews

మనసున్న బ్యాంకులు కావాలి

1kviews

న బ్యాంకులు ధనిక వర్గాలకే చుట్టాలా? పేద, మధ్యతరగతి వారి పాలిట శాపాలా? బ్యాంకర్లు తమ సేవలను తమకు లాభం చేకూర్చే వారికి మాత్రమే పరిమితం చేయాలనుకుంటున్నారా? బ్యాంకుల ద్వారా ప్రభుత్వాలు పేద, మధ్యతరగతి ప్రజలకు అందించదలచుకున్న ఫలాలను వారికి అందించడానికి బ్యాంకులు సిద్ధంగా లేవా? అది తమ పని కాదని బ్యాంకు యాజమాన్యాలు, సిబ్బంది భావిస్తున్నారా? పేద, మధ్యతరగతి వర్గాలకు సేవలందించడం లాభసాటి కాదని బ్యాంకులు భావిస్తున్నాయా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇవన్నీ నిజమేనేమో అనిపించక మానదు.

ఈమధ్య దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ రజనీష్ కుమార్ కి మధ్య ఫిబ్రవరి 27న గౌహతిలో జరిగిన సంభాషణ ఆడియో బైట పడింది. ఆ సంభాషణ వివరాలు పరిశీలిస్తే మన మదిలో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవక మానవు.

ఫిబ్రవరి 27న ఒక కార్యక్రమంలో అస్సాంలోని తేయాకు తోటలలో పనిచేసే రెండున్నర లక్షల మంది పేద కార్మికుల ఖాతాలలోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ద్వారా లభించే మొత్తాలు చేరడం లేదు అని దేశ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి వచ్చింది. ఈ అంశంపై అక్కడే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ రజనీష్ కుమార్ ని ఆమె ప్రశ్నించారు. వారికి కేవైసీ (నో యువర్ కస్టమర్) లేదని బ్యాంకు వారు వారి ఖాతాలను ప్రభుత్వాల పథకాలతో అనుసంధానించటానికి నిరాకరిస్తున్నారని తెలుసుకున్న ఆర్థికమంత్రి ఆయనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ విషయంలో శ్రీమతి సీతారామన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ను ప్రశ్నిస్తూ “మీ అసమర్ధత కారణంగానే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని, నేను, అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అందరూ, అన్నీ నేడు తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మీది చాలా పెద్ద బ్యాంకు అని మీరు చెప్పుకుంటున్నారు కానీ మీకు అంత పెద్ద హృదయం లేదు” అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నిజానికి బ్యాంకుల యొక్క, బ్యాంకు ఉద్యోగుల యొక్క అసమర్థత, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా సామాన్యులు ఏ పని మీద అయినా బ్యాంకులకు వెళ్లాలంటేనే ఇబ్బందిగా భావించే పరిస్థితులు నెలకొని ఉన్నాయి అంటే అతిశయం ఏమీ కాదు.

పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలకు, సంపన్నులకు బ్యాంకులు వేల కోట్ల రూపాయలు అప్పులు ఇవ్వడం, వారు వాటిని తిరిగి చెల్లించకుండా ఏ విదేశాలకో పారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం.

నిజానికి సామాన్యులు ఎవరైనా బ్యాంకులో ఖాతా ప్రారంభించాలని వెళితే “నీకు  ఆధార్ కార్డు ఉందా? పాన్ కార్డు ఉందా? నిన్ను బ్యాంకుకు పరిచయం చేస్తూ సంతకం పెట్టే వారు ఎవరైనా ఉన్నారా ?(వారు ఖచ్చితంగా ఆ బ్యాంకులో ఖాతా ఉన్న వారై ఉండాలి) వంటి ప్రశ్నలు తరచూ ఎదురవుతూ ఉంటాయి.

ఇక ఏదైనా లోను కావలసి బ్యాంకుకు వెళితే ఇక వారు చెప్పే నియమ నిబంధనలు, పెట్టే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అసలు అన్నిటికంటే పెద్ద సమస్య పూచీ దారుడిది. ఏదో స్నేహితుడనో, బంధువనో, సహోద్యోగనో పూచీ సంతకం పెడితే…. ఆ లోన్ తీసుకున్న వ్యక్తి పొరపాటున ఏ ఒక్క నెల తన కంతు కట్టకపోయినా ఇక ఆ పూచీదారుని ప్రతి పనికీ అది అడ్డమై కూర్చుంటోంది. పైగా పూచీ దారుని అవసరం లేని ముద్ర లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు వంటి వాటికి కూడా బ్యాంకు వారు పూచీకత్తు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు నుంచి ఏదైనా లోను పొందాలంటే ఒక పూచీదారుని వెతుక్కోవడమే పెద్దపని. లోన్ కట్టడం కొద్దిగా అటు ఇటు అయితే బ్యాంకు వాళ్లు పెట్టే బాధలకు భయపడి కొందరు ఎంత ముఖ్యమైన వారికైనా సరే, నమ్మకస్తులకైనా సరే పూచీ సంతకం పెట్టాలంటే హడలిపోయే పరిస్థితి నిర్మాణమైంది.

సాధారణమైన చిన్న మొత్తాల లోన్లు జారీ చేయడానికే ఇంత హడావుడి చేసే బ్యాంకర్లు వేల కోట్ల రూపాయల లోన్లు మంజూరు చేసేటప్పుడు ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? నిజానికి అలాంటి లోన్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు మనకు కనబడవు. మరి అలాంటి జాగ్రత్తలు ఏవీ తీసుకోకుండానే వారికి అన్నేసి వేల కోట్ల రూపాయల లోన్లు మంజూరు చేశారా? అన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారెలా ఎగ్గోట్టగలుగుతున్నారు? సంపన్నుల విషయంలో ఒకలా, పేదల విషయంలో ఇంకోలా బ్యాంకులు వ్యవహరిస్తున్నాయెందుకు? బ్యాంకులు చేసే పాపాలకు ప్రభుత్వాలనెందుకు బాధ్యులను చేస్తున్నారు?

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాల లబ్ది పేదలకు నేరుగా చేరేలా జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ప్రారంభించుకోవలసినదిగా  ప్రజలకు విజ్ఞప్తి చేసినప్పుడు అనేకమంది పేదలు బ్యాంకులలో ఖాతాలు మొదలు పెట్టుకోవడానికి బ్యాంకులకెళ్ళారు. బ్యాంకులు వారిచేత జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ప్రారంభింప జేయాల్సి ఉండగా, మినిమమ్ బ్యాలెన్స్ పేరుతో వారిచేత కొంత మొత్తాన్ని కట్టించుకుని మరీ ఖాతాలు ప్రారంభించిన ఉదంతాలు అనేకం. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే బ్యాంకులలో వారు తమ ఖాతాలు ప్రారంభించి అందులో కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకున్న తర్వాత వారు దాన్ని తిరిగి విత్ డ్రా చేసుకునే సమయంలో మీ ఖాతాలో కనీస మొత్తం ఇంత (500 నుంచి  5 వేల వరకు) ఉండాలి కనుక మీరు ఆ మొత్తాన్ని విత్ డ్రా చేయడానికి వీల్లేదు అని బ్యాంకు ఉద్యోగులు చెబితే…. అవగాహన లేమి కారణంగా “ప్రభుత్వం మమ్మల్నిమోసం చేసింది. బ్యాంకు అకౌంట్ల పేరుతో మా డబ్బులు తీసేసుకుంటున్నది”. అని కొందరు వాపోయిన పరిస్థితులు అనేకం. “మీ డబ్బులు ఎక్కడికీ పోవు. మీ అకౌంట్లోనే ఉంటాయి.” అని తెలియని వారికి వివరించే ఓపిక కూడా బ్యాంకు ఉద్యోగులు ప్రదర్శించిన పాపాన పోలేదు.

ఇక ఏటీఎం కష్టాలు సరేసరి. మనకు ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంలో కాకుండా వేరే బ్యాంకు ఏటీఎంలో నగదును విత్ డ్రా చేసుకుంటే కొన్ని లావాదేవీల తర్వాత అదనపు చార్జీలను మనం బ్యాంకు వారికి చెల్లించవలసి ఉంటుంది. కానీ కొన్ని బ్యాంకుల ఏటీఎంలు ఎప్పుడూ సరిగా పనిచేయవు. అవసరం నిమిత్తం వేరే బ్యాంకుల ఏటీఎంలలో నగదు విత్ డ్రా చేసుకుంటే చార్జీలు మోత మోగిపోతాయ్.

చాలా మందికి గుర్తుండే ఉంటుంది. నోట్ల రద్దు సమయంలో కూడా బ్యాంకర్లు అనేక ఒత్తిళ్లకు, రాగద్వేషాలకు, ధనాశకు తలొగ్గి అనేకమంది సంపన్నులకు డబ్బును పెద్ద మొత్తంలో మార్చి ఇచ్చారనే వార్తలు అధికంగానే వినిపించాయి. కొన్ని కొన్ని చోట్ల కొందరు వీడియోలు చిత్రించి సోషల్ మీడియాలో పెట్టటాన్ని కూడా మనమెరుగుదుము.

అలాంటి బ్యాంకులు, ఉద్యోగులందరి పైనా కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందని, అప్పటి వారి లావాదేవీలపై విచారణ జరుపుతున్నదనే వార్తలు కూడా వస్తున్నాయి.

వాటిలో నిజానిజాల మాట ఎలా ఉన్నా లక్షలలో జీతాలు తీసుకునే బ్యాంకు ఉద్యోగుల నిర్లిప్తత, నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అహంకారం వెరసి సామాన్యులకు బ్యాంకులంటే ఏవగింపు కలుగుతోంది.

బ్యాంకులు పెద్ద పెద్ద వారికి లోన్లు ఇచ్చేముందు వారికి లోన్లు ఇవ్వడం ద్వారా ఎలాంటి పరిశ్రమలు వస్తున్నాయి? వాటి ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తోంది? ఆ పరిశ్రమల ద్వారా జరిగే ఎగుమతులు, దిగుమతుల ద్వారా దేశంలోకి ఎంత విదేశీ మారక ద్రవ్యం వస్తోంది? ఆయా పరిశ్రమలు, వ్యాపారాలు దేశ ప్రగతికి ఏ విధంగా దోహద పడుతున్నాయి? అని ఆలోచించాలి. కానీ దురదృష్టం బ్యాంకర్లు, వారి ఉద్యోగులు తమ స్వంత లాభం మాత్రమే చూసుకుంటున్నందువల్ల ఫలితాలు ఇలా ఉంటున్నాయి.

ఈ పరిస్థితిలో మార్పు రావాలి. బ్యాంకుకు వెళితే మన పని ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం సామాన్యుల హృదయాలలో ప్రోది చేసుకోవాలంటే బ్యాంకు యాజమాన్యాలు, ఉద్యోగులు తమ పనితీరును మరింతగా  మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే సామాన్యులకు బ్యాంకు లావాదేవీలు మరింత శులభతరం కావాలి. బ్యాంకుల వల్ల ఆ పరిసర గ్రామాల ప్రజల స్థితిగతులలో మార్పులు రావాలి. వారి ఉత్పాదక శక్తి పెరగాలి. బ్యాంకులు సామాన్యుల పాలిట కల్పతరువు కావాలి. సామాన్యుల సొమ్ములను కాపాడడానికి, వారికి అవసరమైన వేళలో చేయూత నివ్వడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా చేయడానికి బ్యాంకులు పని చేయాల్సి ఉంది.

కేవైసీ పేరుతోనో, అర్థంలేని నిబంధనల పేరుతోనో వివిధ పనులు, అవసరాల నిమిత్తం తమ వద్దకు వచ్చే అమాయక, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను వేధించడం ద్వారా బ్యాంకులు తమకు నిర్దేశించిన లక్ష్యాల నుంచి దూరం జరుగుతున్నాయి. బ్యాంకులు క్రమంగా సామాన్యుల విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. “మా ఖాతాదారులకే మా మొదటి ప్రాధాన్యత” అనే మాట కేవలం వ్రాతలకే పరిమితం చేయకూడదు. దానిని నిజం చేసేందుకు అనుక్షణం ప్రయత్నించాలి. తద్వారా బ్యాంకు యాజమాన్యాలు, ఉద్యోగులు  తమను తాము మనసున్న వారిగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.