News

రోహింగ్యా క్యాంపుల్లో తీవ్రవాద కార్యకలాపాలు.. బంగ్లాదేశ్‌లో కలకలం

52views

బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శరణార్థి శిబిరాల్లో మానవతా సాయం ముసుగులో పాకిస్థాన్, టర్కీలకు చెందిన కొన్ని అంతర్జాతీయ ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థలు (NGOs) తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఒక నివేదిక సంచలన ఆరోపణలు చేసింది. కాక్స్ బజార్ ప్రాంతంలోని ఈ శిబిరాలను, వాటి పరిసరాలను సదరు సంస్థలు తమ కార్యకలాపాలకు సురక్షిత స్థావరాలుగా మార్చుకున్నాయని ఆ నివేదిక పేర్కొంది.

బంగ్లాదేశ్ వార్తాపత్రిక ‘సోనార్ బంగ్లా’ ప్రచురించిన కథనం ప్రకారం.. గత రెండేళ్లుగా ఈ స్వచ్ఛంద సంస్థలు తమ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించాయి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రస్తుత మధ్యంతర ప్రభుత్వ హయాంలో పాకిస్థాన్, టర్కీలకు చెందిన సీనియర్ సైనిక నిఘా అధికారులు ఈ ప్రాంతంలో సర్వేలు కూడా నిర్వహించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. సుమారు పది లక్షల మందికి పైగా ఆశ్రయం పొందుతున్న రోహింగ్యా సంక్షోభాన్ని కొన్ని సంస్థలు తమ రాజకీయ, సైద్ధాంతిక ప్రయోజనాల కోసం పావుగా వాడుకుంటున్నాయని పేర్కొంది.

ఇస్లామిక్ రిలీఫ్, ముస్లిం ఎయిడ్, మెర్సీ మలేషియా, ఎస్కేబీ (స్మాల్ కైండ్‌నెస్ ఆఫ్ బంగ్లాదేశ్) వంటి పలు సంస్థల పేర్లను ఈ నివేదికలో ప్రస్తావించారు. ముఖ్యంగా ఎస్కేబీ సంస్థకు జమాత్-ఎ-ఇస్లామీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిణామాలను స్థానికులు ‘పాక్-టర్కీ శకం’గా అభివర్ణిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, ఉగ్రవాదుల చొరబాట్లపై సర్వత్రా భయాందోళనలు నెలకొన్నాయి.

కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ సంక్షోభాన్ని కొనసాగించడం ద్వారా లబ్ధి పొందుతున్నాయని, రోహింగ్యాలను తిరిగి తమ స్వదేశానికి పంపే ప్రయత్నాలను అడ్డుకుంటున్నాయని ‘రోహింగ్యా రిపాట్రియేషన్ స్ట్రగుల్ కమిటీ’ చైర్మన్ హమీదుల్ హక్ చౌదరి ఆరోపించారు. ఈ సంస్థల కార్యకలాపాలపై కఠిన నిఘా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ నివేదికలోని ఆరోపణలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు.