News

నంద్యాలలో వైభవంగా శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర

6views

నంద్యాల జిల్లాలో విశ్వహిందూ పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన “శ్రీ వీర హనుమాన్ శోభాయాత్ర” అత్యంత వైభవోపేతంగా జరిగింది. భక్తి, దేశభక్తి, సాంస్కృతిక చైతన్యం సమ్మిళితమైన ఈ మహోత్సవం నంద్యాల పట్టణాన్ని కాషాయమయం చేసింది.

కార్యక్రమానికి ముందు చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా సాగిన ఈ ప్రదర్శనలు సభలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణాన్ని నింపాయి.

అర్చక స్వాములచే శాస్త్రోక్తంగా, మంత్రోచ్చారణల మధ్య శ్రీ వీర హనుమాన్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీ బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి అధ్యక్షతన సభ ప్రారంభమైంది. వేదాంత గీత శివం ఫౌండేషన్, చాగలమర్రికి చెందిన పూజ్య శ్రీశ్రీశ్రీ ఆచార్య అభినవ శంకరానంద స్వామీజీ ఆశీర్వచనాలతో కార్యక్రమానికి ఆధ్యాత్మిక శోభ చేకూరింది.

ఈ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి, తెలంగాణ ప్రాంత ప్రచారక్ మరియు విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ అధికార ప్రతినిధి శ్రీ రావినూతల శశిధర్, వి హెచ్ పి దక్షిణాంధ్ర ప్రాంత ఉపాధ్యక్షులు శ్రీ యర్రం విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా సంఘ్ చాలక్ శ్రీ చిలుకూరి శ్రీనివాస్, శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల అధినేత శ్రీ గడ్డం రామకృష్ణారెడ్డి, బజరంగ్ దళ్ దక్షిణాంధ్ర సంయోజక్ పోలేపల్లి సందీప్, విశేష సంపర్క ప్రముఖ్ మరియు శోభాయాత్ర ప్రముఖ్ శ్రీ కాల్వ శేషసాయి తదితరులు హాజరై వేదికను అలంకరించారు.

ప్రధాన వక్త శ్రీ రావినూతల శశిధర్ మాట్లాడుతూ హిందూ సమాజం ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని బలంగా ప్రతిపాదించారు. “కలిసుంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం” అంటూ సమాజంలో ఐక్యతే శక్తి అని పేర్కొన్నారు. దేశ విభజన చరిత్రను ప్రస్తావిస్తూ, నిర్లక్ష్యం మరియు విభేదాల వల్ల అఖండ భారతం అనేక ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ విరోధ, విధర్మ శక్తులు కుట్రలతో సిద్ధంగా ఉన్నాయని హెచ్చరిస్తూ, ప్రతి హిందువు ధర్మరక్షణకు కట్టుబడాలని పిలుపునిచ్చారు.

శోభాయాత్రలో వినిపించే నినాదాలు ప్రతి హిందువు గుండెను తట్టి మేల్కొలిపేలా ఉండాలని, శత్రు శక్తుల్లో భయం కలిగించే స్థాయిలో హిందూ ఐక్యత ప్రతిఫలించాలని పేర్కొన్నారు.

నంద్యాల జిల్లాలోని దేవాలయాలు, మఠాలు, మందిరాలకు చెందిన వేల ఎకరాల ఆస్తులు కబ్జాలకు గురయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఆస్తులను తిరిగి దేవాలయాల ఆధీనంలోకి తీసుకువచ్చి, సనాతన ధర్మ పరిరక్షణకు వినియోగించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని కోరారు.

దీనిపై స్పందించిన ఎంపీ శబరి, సంబంధిత వివరాలు అందిన వెంటనే సమస్య పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని సభాముఖంగా హామీ ఇచ్చారు. దేవాలయాల పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

“జై శ్రీరామ్”, “జై హనుమాన్”, “భారత్ మాతాకీ జై” నినాదాలతో సభ ప్రాంగణం మార్మోగిపోయింది. అనంతరం నిర్వహించిన భారీ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాషాయ పతాకాలు రెపరెపలాడుతుండగా భక్తి గీతాలు, దేశభక్తి సంగీతం మధ్య యువత ఉత్సాహంగా కదం తొక్కింది.

మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలికల కోలాట ప్రదర్శనలు, సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శోభాయాత్ర మార్గమంతా ప్రజలు పుష్పవృష్టి చేసి భక్తులను ఆహ్వానించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలుగా తాగునీరు, చల్లని మజ్జిగ పంపిణీ చేసి నంద్యాల ప్రజలు తమ ఆతిథ్యాన్ని చాటుకున్నారు.

స్థానిక పెద్దబండ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం వరకు శోభాయాత్ర ఘనంగా కొనసాగింది. అనంతరం మహాప్రసాద వితరణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.