News

హిందూ మనోభావాలను దెబ్బతీసిన సబ్బు యాడ్.. క్షమాపణలు చెప్పిన నటుడు అలీ

8views

టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ ఆలీ నటించిన ఓ సబ్బు ప్రకటన సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. హిందూ ఆచారాలు, దేవతల పట్ల గౌరవం తగ్గేలా యాడ్ రూపొందించారంటూ పలువురు హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ ప్రకటనలో లక్ష్మీదేవికి పూజలు చేస్తున్నట్లుగా చూపిస్తూ, ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలోని “జై జై లక్ష్మి” పాటను వినియోగించడం వివాదాస్పదమైంది. అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్‌లో మంత్రాల మాదిరి శబ్దాలు వినిపించడం కూడా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని విమర్శలు వెల్లువెత్తాయి.

సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్, విమర్శలు రావడంతో అలీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన క్షమాపణలు తెలుపుతూ వీడియో విడుదల చేశారు. “ఆ సీన్ నేను గతంలో సినిమాలో చేసినదే. అదే కాన్సెప్ట్‌ను యాడ్‌లో ఉపయోగించారు. కానీ చాలా మందికి అది నచ్చలేదు. ఎవరికైనా మనస్తాపం కలిగితే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుకుంటున్నాను” అని తెలిపారు.

అలాగే వివాదాస్పద ప్రకటనను వెంటనే తొలగించినట్లు కూడా అలీ వెల్లడించారు. దీంతో ఈ అంశంపై కొనసాగుతున్న వివాదానికి కొంతవరకు తెరపడినట్లైంది.