
( ఏప్రిల్ 16 – తెలుగు నాటక రంగ దినోత్సవం )
ఆధునిక నాటక రంగం వయసు రమారమి ఒకటిన్నర శతాబ్దాలు. ఒక జాతి సాంస్కృతిక రంగ ప్రస్థానంలో ఇది అల్పకాలమే అయినా, సుమారు శతాబ్దానికి పైగా ఉజ్జ్వలకాలంగా భాసించింది. పురాణేతిహాసాల ఇతివృత్తాలు, కథాంశాలతో రాజాస్థానాలు, జమీందారుల లోగిళ్లకు పరిమితమైన నాటక ప్రక్రియ ప్రజావేదికపైకి, ప్రజల మధ్యకు వచ్చింది. ఎందరో నాటకకర్తలు సామాజిక సమస్యలు చొప్పించి జనరంజకం చేశారు. సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు స్వీయ రచన ‘వ్యవహార ధర్మబోధిని’ని ప్రదర్శించడం ద్వారా (1880) ఆధునిక నాటక ప్రదర్శనకు ఆద్యులయ్యారు. మహాకవి గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ (1897) నాటకరంగ చరిత్రనే మలుపు తిప్పింది. రంగస్థల, చలన చిత్రనటుడు బళ్లారి రాఘవాచార్యులు (రాఘవ) నాటక ప్రదర్శనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
సంగీత సాహిత్య నృత్య శిల్ప చిత్రలేఖన లలితకళల సమాహార కళ నాటకం. అందుకే ‘కావ్యేషు నాటకం రమ్యమ’ అనే ఆర్యోక్తి పుట్టి ఉంటుంది. దశవిధ రూపకాలలో నాటకం ఉత్తమం, ఉత్కృష్టమైనదనీ సాహిత్య విమర్శకులు వ్యాఖ్యానిం చారు. దశవిధ రూపకాలలో నాటకం మినహా దేûనితోనూ మానవ జీవితాన్ని పోల్చలేదు. మానవ జీవితాన్ని నాటకంతో పోల్చారు ప్రఖ్యాత నాటకకర్త విలియమ్స్ షేక్‌స్పియర్. ‘ప్రపంచమే ఒక రంగస్థలం. అందులో మనమంతా పాత్రధారులం. ఆగమనం… నిష్క్రమణం…మధ్యలో అనేకానేక పాత్రలు’ అని తన ‘యాజ్ యు లైక్ ఇట’ నాటకంలో జాక్వెస్ పాత్రతో పలికించారు.
మన దేశంలో వేదకాలం నుంచి నాటక ప్రక్రియ ఉన్నట్లు కొన్ని ఆధారాలు ఉన్నప్పటికీ భాసుడి కాలం నుంచే అంటే క్రీ.పూ. 3 వ శతాబ్ద్దం నుంచి స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. క్రీస్తు పూర్వమే నిర్మితమైన భారతీయ నిర్మాణాలలో నాగార్జునకొండలో ఆరుబయలు రంగస్థలం (ఓపెన్ ఎయిర్ థియేటర్) బయల్పడిందనే ఆధారాలను బట్టి మన దేశంలోనూ నాటకరంగం ప్రపంచ నాటక రంగంతో సమాంత రంగా అభివృద్ధి చెందుతూ వచ్చిందని చరిత్రకారులు భావిస్తున్నారు.
దేశంలో నాటకం సాధారణ శకం 1840ల తరువాత ఆరంభమైతే, తెలుగునాట 1860 ప్రాంతాలలో ప్రారంభమైంది. అది అభివృద్ధి దశకు చేరుకున్నది మాత్రం కందుకూరి నాటక (వ్యవహార ధర్మబోధిని) ప్రదర్శన తరువాతనే పరిశోధకులు నిర్ధారించారు. కోనసీమకు చెందిన కోరాడ రామచంద్ర శాస్త్రి మొదటి నాటక (‘మంజరీ మధుకరీయం-1860)కర్త అయినా, అది ఎక్కడా ప్రదర్శితం కాలేదు. అప్పట్లో నాటక ప్రదర్శనకు మహిళలే కాదు… పురుషులూ ముందుకు వచ్చే వారు కాదట. నాటకాలను ప్రదర్శిస్తే చెడిపోయిన వారిగా పరిగణించే పరిస్థితులు. కోరాడ వారి తరువాత కూడా అనువాద నాటకాలు వచ్చినా, అవి పుస్తకాలకే పరిమితమయ్యాయి. ఈ తరువాత సరిగ్గా రెండు దశాబ్దాలకు కందుకూరి తన విద్యార్థులతో నాటకం ప్రదర్శింపచేశారు.
అప్పటివరకు యక్షగానాలు, తోలుబొమ్మలు, వీధినాటకాలు, పగటి వేషాలు లాంటి జానపద కళారూపాలే వినోద, విజ్ఞాన సాధనాలు. గురజాడ మొదలుకొని ఎందరో రచయితలు, ప్రయోక్తలు, నాటక సంస్థలు, నాటక పరిషత్‌లు నాటక ప్రదర్శనలో కొత్త పోకడలు ప్రవేశపెట్టారు. ప్రజా చైతన్యానికి ఒక కథ, కావ్యం కన్నా నాటక ప్రక్రియ పదునైన వజ్రాయుధంగా భావించి, రచయితలు సమకాలీన సమస్యలను ఇతి వృత్తంగా తీసుకొని పుంఖానుపుంఖాలుగా నాటకాలు రాశారు. వాటిలో చాలా వరకు లెక్కకు మిక్కిలిగా ప్రదర్శిత మయ్యాయి.
అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆయా దేశాలు స్పందించినట్లే తెలుగు నాటకాల రచన, ప్రదర్శనల్లో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. సమాజంలోని అన్యాయాలు, అక్రమాలకు ‘ప్రతిస్పందన’గా నిలిచాయి. కందుకూరి ‘వ్యవహార ధర్మబోధిని’ అవినీతితో నిండిపోయిన న్యాయవ్యవస్థ ప్రక్షాళనానికి సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించింది. గురజాడ ‘కన్యాశుల్కం’ బాల్యవివాహాలను నిరసిస్తూ, వాటిని రూపుమాపుతూ చట్ట రూపకల్పనకు దారి వేసింది. వ్యసనాలు మనిషిని ఎలా పతనం చేస్తాయో కాళ్లకూరి నారాయణరావు ‘చింతామణి, మధుసేవ’ నాటకాలలో ఆవిష్కరించారు. గురజాడ, వేదం వెంకటరాయశాస్త్రి నాటకాలు భాషాపరంగా సంచలన ప్రయోగాలకు నాంది పలికాయి. ‘కన్యాశుల్కం’ వ్యవహారిక భాషకు వేదం వారి ‘ప్రతాప రుద్రీయం’ పాత్రోచిత భాషకు పట్టం కట్టాయి. ఇలా చెప్పుకుంటూపోతే నాటి నుంచి నేటి దాకా ఎందరో రచయితలు, ప్రయోక్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.
నాటక ప్రదర్శన కేవలం ఆనందం, ఆహ్లాదాలను పంచడానికే పరిమితం కాకుండా ఆ ప్రక్రియ ద్వారా సమాజానికి మరమ్మతులు చేయాలన్న ఆలోచన ప్రబలమైంది. ఆకలి, దగా, దోపిడీ, సంఘర్షణ లాంటివి కథా వస్తువులయ్యాయి. పురాణేతిహాస కథలకు, అందులోని ఊహాజనిత పాత్రలకు స్వస్తి పలికి, ‘కళ ప్రజల కోసం’అనే భావనను పెంచుకొని నిత్యం తారసిల్లే మనిషి జీవితానుభవాలనే కథలుగా ఎంచుకొన్నారు. ర్పుాకీయ, సామాజిక పరిస్థితులు, సమాజంలోని లొసుగులు, వ్యసనాలు, మూఢాచారాలను ప్రతిబింబిస్తూ ఎన్నో నాటకాలు వెలువడి పునః ప్రదర్శనలతో అలరించాయి. తెలుగునాట దేశభక్తి ప్రేరేపితం, ప్రబోధాత్మకమైన ఎన్నో సాహిత్య పక్రియలు దూసుకువచ్చినా, కళా వినువీధుల్లో విహరించింది మాత్రం నాటకమే. వినోద ప్రధానంతో పాటు జాతీయోద్యమ భావనను, స్వరాజ్యకాంక్షను రేకెత్తించి ప్రజాచైతన్యానికి ప్రయత్నించింది. అది ఆంగ్ల ప్రభుత్వం, నిజాం సర్కార్‌కు కంటగింపై పదులకొద్దీ నాటకాలు నిషేధ జాబితాలో చేరాయి.
అంత విశిష్ట నాటకరంగ ఉత్థానపతనాలను స్థూలంగా సమీక్షించుకుంటే…. సుమారు ముప్పావు శతాబ్ద కాలంలో ఎన్నో పరిణామాలు. నటనను పవిత్రంగా భావించి, దైవ ప్రార్థనతో నా{కం వేసే రోజుల్లో నాటక సమాజాలకు కొందరు పోషకులు ఉండేవారు. కొందరు సంపన్నులు నాటక ప్రదర్శనల ద్వారా వచ్చే ఆదాయంతో సంస్థలు నడిపేవారు. అలాంటి సమయంలో దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడి వృత్తి కళాకారులు నిరుద్యోగు లయ్యారు. ‘కాంట్రాక్ట’ వ్యవస్థ రంగప్రవేశం చేసింది. 1925-45 మధ్య కాలంలో అమరిన నాటకశాలలు ఆ తర్వాత సినిమాహాళ్లుగా, కల్యాణమండపాలుగా, గిడ్డంగులుగా మారాయి, మారుతున్నాయి. వెండితెర ప్రభావం రంగస్థలంపైన పడితే, బుల్లితెర, ఆధునిక మాధ్యమాలు వెండితెరను ప్రభావితం చేస్తున్నాయని భావించాలి. ప్రతి జిల్లా కేంద్రం, నియోజవర్గ కేంద్రంలో రంగస్థల నిర్మాణం దశాబ్దాల తరబడి ప్రతిపాదనలకు పరిమితమైందన్నది నాటకాభిమానుల ఆవేదన. రంగస్థలాల కొరత వేధిస్తుండగా, ఉన్నవాటిలోనూ కనీస వసతుల కొరత. ఏదో ఒక హాల్‌ను అద్దెకు తీసుకుని ప్రదర్శనలు ఇవ్వవలసిన పరిస్థితి.
నాటకం వన్నె తగ్గుతోంది. ముఖ్యంగా పౌరాణికాల ప్రదర్శనలు కనుమరుగవుతున్నాయి. ఒకనాడు మహా మహులు నటించిన పౌరాణిక నాటకాలను టికెట్‌లు కొని ఎంతో ఆసక్తిగా చూసేవారంటే ఈ తరానికి ఆశ్చర్యం అనిపించవచ్చు. వర్తమానంలో అదే పౌరాణికం, పద్యనాటకం జానపద కళా రూపంగానే మిగిలిపోతోంది. అడపాదడపా ప్రదర్శిత మవుతున్నా ఆదరణ అంతంత మాత్రమే. విదేశాలలో నాటక పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. అమెరికా వంటి దేశాలలో సినిమా వీక్షణకు సాధారణంగా పది,పదిహేను డాలర్లు ఖర్చు పెట్టే ప్రేక్షకుడు నాటకానికి వచ్చే సరికి పదిరెట్లు వరకు వెచ్చిస్తారని అధ్యయనాల్లో తేలింది. మన దేశంలో మరాఠీ, బెంగాలీ, తమిళ, కన్నడ నాటకరంగాలతో పోల్చిచూస్తే తెలుగునాట నాటక రంగం వెనుకబడే ఉందంటారు.
రంగస్థలమే పుట్టినిల్లు
చలనచిత్ర రంగం ఆరంభానికి నాటకాల ఇతివృత్తాలు ఆధారమైనట్లే, చిత్రాలలో పాత్రపోషణకు రంగస్థల నటులే కీలకమయ్యారు. కనుకనే తొలితరాల చáలనచిత్ర నటీనటులలో అత్యధికులు రంగస్థల అనుభవం గడించినవారే. అగ్రనటుల నుంచి, వివిధ ముఖ్య పాత్రధారులంతా నాటకాను భవం కలిగిన వారే. ఒక్క మాటలో చెప్పాలంటే రంగస్ఠల అనుభవమే సినీ రంగ ప్రవేశానికి సింహ ద్వారంగా భావించేవారు. రంగస్థలాన్ని పుట్టినిల్లుగా సంభావించిన ఆ నటీనటుల్లో చాలామంది కన్నతల్లిని మరువక తరచూ రంగస్థలంపై కనిపించే వారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ఈ తరం నటీనటులకు రంగస్థలం అనుభవం మాట అలా ఉంచి దానితో పరిచయమే ఉన్నట్లు కనబడదని వ్యాఖ్యలు ఉన్నాయి.
ఇతర దేశాలతో, దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చిచూస్తే తెలుగునాటక రంగం తిరోగమనంలో ఉందని దశబ్దాల క్రితం మహానటుడు బళ్లారి రాఘవ మనోగతమే నేటికీ కొనసాగుతోందని ఆ రంగ ప్రముఖులు, విశ్లేషకులు అంటున్నారు. పరిషత్‌లు, ప్రదర్శనలు పెరిగాయి తప్ప నాణ్యత మెరుగుపడలేదని, రాశితో పాటు వాసి పెరగలేదని, ప్రతిభ గల నటులు తయారుకాలేకపోతున్నారని పెదవి విరుస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న నాటకాన్ని సినిమాలు దెబ్బతీశాయనే ఆరోపణ ఉండగా, తాజాగా దూసుకువచ్చిన టీవీ, సామాజిక మాధ్యమాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నాటకరంగాన్ని మరో మెట్టు ఎక్కించడానికి, జాతీయ నాటకం రూపుదిద్దుకొనేందుకు ఔత్సాహిక నాటక రంగ స్థోమత మాత్రమే చాలదు. ప్రాయోజికులు కావాలి. ప్రభుత్వం థియేటర్‌ల వంటి మౌలిక సదుపాయాలు చేకూర్చాలి. కళాకారులను ప్రోత్సహించేలా పురస్కారాలను ఏటా క్రమం తప్పకుండా ప్రదానం చేయాలి. నాటకప్రియులూ ముందుకు రావాలి. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అర్థం లేని నత్యాలు, రికార్డింగ్ డ్యాన్స్‌లకు బదులుగా ప్రబోధాత్మక నాటక ప్రదర్శనలను ప్రోత్సహించాలి. టికెట్ కొని నాటకం చూసే రోజు రావాలి. టికెట్ కొనడం అంటే ఏవో సొమ్ములు వచ్చి పడతాయని కాదు. నాటకానికి అది ఒక ప్రోత్సాహం మాత్రమే. ‘నాటకం సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. సమాజం నాటకాన్ని ప్రభావితం చేస్తుంది’ అన్న రంగస్థల నటన బోధనా విభాగం పూర్వాచార్యుల మాటలు వాస్తవమైతే నాటకం మరింత ప్రజల్లోకి వెళ్లాలి. ఔత్సాహిక నాటక సమాజాలు సజనాత్మక నాటకాలను ప్రదర్శిస్తూనే ఉన్నాయి. నాటక కర్తలకు, కళాకారులకు, కళాభిలాషులకు కొదువలేదు. ప్రోత్సాహమే లోపిస్తోంది. ప్రేక్షకులకు నచ్చేది,వారు మెచ్చేది, సమాజాన్ని చైతన్య పరిచేది, ప్రజా జీవితానికి పనికి వచ్చేది..మంచిని నేర్పేది, చూపేది ఉత్తమ నాటకమని సాధారణ నిర్వచనం. అలాంటివి మరిన్ని ప్రదర్శితం కావాలన్నది నాటక ప్రియులు ఆకాంక్ష.
నాటక వసంతకులు
కందుకూరి సాంఘిక నాటక ప్రదర్శనకు పాదులు తవ్వితే, రంగస్థలంపై సంస్కరణలతో బళ్లారి రాఘవాచార్యులు పందిళ్లు వేశారు. ఇంగ్లండ్‌లో నాటక ప్రదర్శనను చూచిన ఆయన మన నాటకరంగం వెనుకబాటుతనానికి కలత చెందారు. నాటక విద్యాభ్యాస ప్రాశస్త్యాన్ని, అవసరాన్ని ఎలుగెత్తి చాటిన వారిలో ఆయన అగ్రగణ్యులు. శాస్త్రీయ దృక్పథంతో నటించాలనే ఆసక్తి లేకపోవడం, సంగీతం/రాగం మితిమీరడం గమనించిన ఆయన దర్శక నిర్మాత గూడవల్లి రామబ్రహ్మంతో కలసి యువనటులుకు శిక్షణ కోసం నాటి బెజవాడలో ‘భరతముని బృదం’ సంస్థను స్థాపించారు. దేశంలోనే అది మొదటి నాటక పాఠశాలగా వినుతికెక్కింది. స్త్రీపాత్రలను స్త్రీలే ధరించడంలో ఉండే సహజత్వం, ప్రాశస్త్యాన్ని గ్రహించారు. పురుష స్త్రీ వేషధారులతో నటించకూడదని నియమం పెట్టుకున్నారు. ఈ రంగంలో బళ్లారి వెలిగించిన విప్లవజ్యోతి స్ఫూర్తితోనే ప్రజానాట్యమండలి పురుడు పోసుకొంది. సమాజంలోని అవినీతి, మూఢనమ్మకాలు, మూఢాచారాలను వ్యతిరేకిస్తూ నాటకాన్ని ఆయుధంగా మలుచుకున్న వీరేశలింగం జయంతిని (ఏప్రిల్ 16) తెలుగు నాటక దినోత్సవంగా పాటిస్తున్నారు. కందుకూరి, బళ్లారి జయంతి ఒకే తేదీ కావడం కాకతాళీయం.

డా॥ ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్





