
భూమ్మీద నివసించే అన్నిరకాల ప్రాణుల సుఖ జీవనానికి వృక్ష సంపద అవసరం. వాటి భాగాలన్నీ మాత్రమే కాదు, పరిసరాలు కూడా మానవాళికి అనేక రకాలుగా ఉపయోగపడేవే. అందుకే ‘వృక్షో రక్షతి రక్షితః’ అన్న సూక్తి ఏర్పడింది. చెట్లు ప్రాణవాయువును అందించే సంజీవినులన్నది జగమెరిగిన సత్యం.
రామలక్ష్మణులు, పాండవులు వనవాసంలో చెట్ల నీడల్లోనే తమ నివాసాల్ని ఏర్పాటు చేసుకున్నారు. పంచవటి అంటే- అయిదు రకాల మర్రి వృక్షాల మధ్య రాముడు తమ పర్ణశాలను ఏర్పాటు చేసుకున్నాడని రామాయణంలో ఉంది. ఉపవాసం ఉన్న రోజు కొంతమంది మర్రి చెట్టుని పూజిస్తారు. శమీ అంటే జమ్మి. ఈ చెట్టు శని దేవుడికి ప్రీతికరమైందని, ఆయన అనుగ్రహం కోసం జమ్మి మొక్కని నాటాలంటారు. జమ్మిని పూజించిన తర్వాత ఏ పని తలపెట్టినా విజయం కలుగుతుందని నమ్ముతారు.
రావి చెట్టులో దేవతలు నివసిస్తారని, అందుకే ఈ చెట్టుని కల్పవృక్షాలలో ఒకటనీ చెబుతారు. బృహత్ సంహిత, బ్రహ్మపురాణం, తైత్తిరీయోపనిషత్ లాంటి వాటిలోను, బౌద్ధ రచనలలోను జ్ఞాన ఛత్రంగా పిలిచే బోధి వృక్షం(రావి చెట్టు) ప్రస్తావన ఉంది. నేడు అశోక వృక్షాలుగా పిలుస్తున్నవి రామాయణ కాలం నాటి అశోకవృక్షాలు కావు. ‘అశోక’ అంటే శోకం లేని, మానసికోల్లాసం కలిగించేదని అని అర్థం. అశోకవనంలో సీతాదేవికి నీడనిచ్చింది శింశుపా వృక్షం(ఇరుగుడు చెట్టు). దీన్ని ‘తామ్ర పల్లవి’ అనీ అంటారు. బుద్ధుడు పుట్టింది కూడా ఈ వృక్షం కిందేనని కొన్ని బౌద్ధకథలు చెబుతాయి. కోసంబి నగరంలో శింశుపా వృక్షం కిందే బుద్ధుడు బోధనలు చేసేవాడట. ఇక శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వ వృక్షాన్ని(మారేడు) అయితే ఔషధాల గని అనవచ్చు. అల్లరి చేస్తున్న బాలకృష్ణుడికి శిక్షగా రోటికి కట్టేసింది యశోద. ఆ దుడుకు చిన్నవాడు మద్ది వృక్షాల మధ్య నుంచి రోటిని ఈడ్చుకుంటూ పోయాడు. అంతపెద్ద మానులు అతడి ధాటికి ఫెళఫెళమంటూ కూలి ఇద్దరు గంధర్వులకు శాపవిముక్తి కలిగినట్లు భాగవతం చెబుతోంది. అవతారం పరిసమాప్తి సమయంలో కృష్ణుడు ‘అస్త’ వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటుండగా వేటగాడు బాణాన్ని ప్రయోగించాడని చెబుతారు. వేప చెట్టును అమ్మవారికి ప్రతీకగా భావించి కొలుస్తారు. వటవృక్షం విష్ణుమూర్తికి ఆశ్రయమిచ్చినందున ఆయనను వటపత్రశాయిగా పూజిస్తాం. తులసి మొక్కను ఇంట్లో నిత్యం అర్చిస్తే- కార్తికంలో ఉసిరి చెట్టు పూజనీయమవుతుంది.
త్రిభువనాలకు గురువైన దక్షిణామూర్తి వటవృక్ష మూలమందు కూర్చున్నట్టు పురాణాలు వర్ణించాయి. గురు దత్తాత్రేయునికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఔదంబరం(మేడి). ఈ చెట్టు ఇంట్లో ఉంటే సాక్షాత్తు దత్తుడు ఆ ఇంట్లో ఉన్నట్లేనని భక్తుల నమ్మకం. మనం కొలిచే దేవతలంతా ఇలా చెట్లకు ఎంతో విలువిచ్చారు. మనిషి కూడా ఆ విషయం గుర్తుంచుకుని మసలుకోవాలి. ప్రకృతిని కాపాడుకోవాలి.





