
విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా సుమారు 375 మంది ఎంపీలను కలిసి “మైనారిటీ” అనే పదానికి స్పష్టమైన మరియు తార్కికమైన కొత్త నిర్వచనాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
భారత రాజ్యాంగం మైనారిటీలకు ప్రత్యేక హక్కులు కల్పించినప్పటికీ, “మైనారిటీ” అంటే ఎవరు అనేదానికి ఖచ్చితమైన నిర్వచనం ఇవ్వలేదని వీహెచ్‌పీ పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న విశేషాధికారాలతో ఏ వర్గాన్నైనా మైనారిటీగా ప్రకటించే విధానాన్ని మార్చాలని కోరింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 మరియు 30 కింద మైనారిటీ విద్యాసంస్థలకు లభిస్తున్న ప్రత్యేక హక్కులను దేశంలోని పౌరులందరికీ, అన్ని మత వర్గాలకు సమానంగా వర్తింపజేయాలని ఈ సందర్భంగా వీహెచ్పీ డిమాండ్ చేసింది. దేశంలో మారుతున్న జనాభా సమతుల్యతను (Demographic Imbalance) దృష్టిలో ఉంచుకుని జాతీయ జనాభా నిర్వహణ విధానాన్ని తీసుకురావాలని కోరింది.
ఏ వర్గానికైనా మైనారిటీ హోదా ఇవ్వాలంటే కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వీహెచ్‌పీ సూచించింది.
సదరు సామాజిక వర్గం భారతదేశంలో చారిత్రక కాలంలో మతపరమైన వేధింపులకు గురై ఉండాలి అనీ, సమాజంలోని ఇతర వర్గాల కంటే ఆ వర్గం సామాజికంగా లేదా ఆర్థికంగా గణనీయంగా వెనుకబడి ఉండాలి. జాతీయ స్థాయి కాకుండా, రాష్ట్రాల వారీగా ఉన్న జనాభా లెక్కల ఆధారంగానే మైనారిటీ హోదాను నిర్ణయించాలని పేర్కొంది.
ముస్లింలు , క్రైస్తవులు అంతర్జాతీయంగా మెజారిటీగా ఉన్నారని, భారతదేశంలో కూడా వారి జనాభా పెరుగుతున్నందున వారిని మైనారిటీలుగా పరిగణించడం తగదని వీహెచ్‌పీ తన విన్నపంలో అభిప్రాయపడింది.





