News

ఢిల్లీ ఆలయాలు.. రద్దీ ప్రాంతాల్లో లష్కరే ఉగ్రవాది రెక్కీ

39views

భారత్‌లో దాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తయ్యిబా ఆపరేటివ్‌ షబ్బీర్ అహ్మద్ లోన్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. షబ్బీర్‌ది జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా. 2004-2005 సమయంలో పలువురు లష్కరే ఉగ్రవాదులు ఆహారం, ఆయుధాల కోసం అతడి నివాసానికి తరచూ వస్తుండేవారు. ఆ సమయంలోనే అతడు లష్కరేలో చేరాడు.

పాక్‌లోని లష్కరే తయ్యిబాకు చెందిన ఆసిఫ్ దార్, సుమామా బాబర్‌ అనే హ్యాండ్లర్‌లతో ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌ల ద్వారా షబ్బీర్ అహ్మద్ నిరంతరం సంప్రదింపులు జరిపేవాడు. దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లా దేశీయులతో భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం కోసం ఓ ముఠాను ఏర్పాటుచేశాడు. ఈ ముఠా సభ్యులు దిల్లీ సహా దేశంలోని ప్రముఖ నగరాల్లోని ఆలయాలు, రద్దీగా ఉండే వాణిజ్య సముదాయాల వద్ద రెక్కీ నిర్వహించేవారు. అక్కడి భద్రతా లోపాలను అంచనా వేసి, దాడులకు ప్రణాళికలు రచించేవారు. వీరికోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్లీపర్‌ సెల్స్‌ కూడా పని చేస్తున్నారు.

అంతేకాకుండా కశ్మీర్‌ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా షబ్బీర్ వారికి సోషల్‌ మీడియా సందేశాలు, ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు అనేకమంది యువకులను అతడు లష్కరేలో చేర్చాడన్నారు. అతడి వద్ద భారత్, పాక్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌కు చెందిన కరెన్సీ, ఇతర పత్రాలు, మొబైల్ ఫోన్లు, రెండు సిమ్‌లు లభ్యమయ్యాయని.. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.