
మరికొన్ని రోజుల్లో మొదలుకానున్న చార్‌ధామ్ యాత్ర కోసం ఏర్పాట్లు తుది దశకు చేరాయి. ఈ క్రమంలో యాత్రికుల భద్రత, సౌకర్యాల కోసం చేసిన ప్రతిపాదనలను బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బీకేటీసీ) ఆమోదించింది. ఈ ఏడాది రూ.121 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. ఏప్రిల్ 19న అక్షయ తృతీయ రోజు గంగోత్రి, యమునోత్రి ఆలయ తలుపులు తెరచుకోవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 22న కేదార్‌నాథ్, ఏప్రిల్ 23 నుంచి బద్రీనాథ్ ఆలయాల్లో భక్తులను అనుమతిస్తారు.
ఆలయ గర్భగుడిలోకి మొబైల్ ఫోన్లను అనుమతించమని, ఇది తనకు కూడా వర్తిస్తుందని బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది స్పష్టం చేశారు. యూట్యూబర్లు, బ్లాగర్లను ఆలయంలో కొన్ని ప్రాంతాలకు అనుమతించేది లేదన్నారు. తీర్థయాత్రలను, పర్యటకాన్ని కొందరు ఒకేలా చూస్తున్నారని, అవి రెండూ వేర్వేరని చెప్పారు. ప్రతి భక్తుడు మొబైల్ ఫోన్లు, కెమెరాలను భద్రపరిచేందుకు ఆలయం బయట ప్రత్యేకంగా లాకర్లు ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు, చార్‌ధామ్‌కు వచ్చే భక్తుల సంఖ్య ఈసారి కూడా పెరుగుతోందని, రెండు వారాల్లోనే 6లక్షలకు పైగా పేర్లను నమోదు చేసుకున్నారని ఆలయ కమిటీ పేర్కొంది.





