News

స్వదేశీ విత్తనాల సంరక్షణకు యువ రైతుల కృషి

92views

బిహార్‌లోని జముయీ జిల్లా ఖైరా బ్లాకు పరిధి దుమర్‌కోలా గ్రామానికి చెందిన ఇద్దరు యువ రైతులు సేంద్రియ పద్ధతిలో సంప్రదాయ సాగు చేస్తూ.. అంతరించిపోతున్న పలు రకాల స్వదేశీ విత్తనాలను కాపాడుతున్నారు. దాదాపు పదిహేనేళ్లుగా వ్యవసాయం చేస్తున్న నిరంజన్‌ యాదవ్, స్వార్థ్‌ యాదవ్‌ ఇప్పటివరకు 52 రకాల స్వదేశీ వరి, గోధుమ, కూరగాయల విత్తనాలను సేకరించి భద్రపరిచారు. దేశంలోని వివిధ ప్రాంతాలు తిరిగి ఆయా రైతుల నుంచి ఈ విత్తనాలు సేకరించినట్లు రైతు నిరంజన్‌ తెలిపారు. ఇందులో అస్సామీ రకం ‘మ్యాజిక్‌ రైస్‌’ ప్రత్యేకమని, అసలు వంట చేయకుండానే తినేందుకు ఇది సిద్ధమవుతుందని తెలిపారు. 45 నిమిషాలపాటు నానబెడితే అన్నంగా మారిపోతుందని, పూర్వం సైనికులు యుద్ధ సమయాల్లో దీన్ని వాడేవారని వివరించారు. ‘కాలా నమక్‌’ అనే మరో వరి రకం వేల ఏళ్ల నాటిదన్నారు. ‘సాథి’ అనే బియ్యం రకం 60 రోజుల్లోనే కోతకు సిద్ధమవుతుందని తెలిపారు. ఈ యువ రైతులు ఇతర గ్రామాల అన్నదాతలకు వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు.