ArticlesNews

భూగోళం మీద హక్కులు లేని వర్గం

95views

‘హిం’ అంటే అజ్ఞానం ‘దు’ అంటే ఖండించడం. వేదం బోధించినట్టు జ్ఞానం ఏ వైపు నుండి వచ్చినా స్వీకరించి అజ్ఞానాన్ని పోగొట్టుకొనే వాడే హిందువు.

ప్రపంచంలో అత్యంత పురాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందువులున్న ఈ దేశంలో ఎందుకు ప్రతి విషయంలోనూ వారు అవహేళనలను ఎదుర్కోవాల్సి వస్తోంది? ఈ దేశంలో ఉన్నవి రెండే జాతులు. తమ జాతి హిందూజాతితో కలిసి ఉండే ప్రసక్తే లేదని వాళ్లు. వేరే దేశం సాధించుకున్న తరువాత మిగిలినది హిందూదేశంగా ఉండాల్సినప్పటికీ అలా ఎందుకు లేదో మరి!

‘జై శ్రీరామ’ అంటే తప్పు. ‘హరహర మహాదేవ’ అంటే అపరాధం, దసరా, దీపావళి వంటి పండుగలు చేసుకున్నా ఆక్షేపణలు.

144 ఏళ్లకు ఓ సారి వచ్చే మహా పుష్కరాల్లో నదీస్నానం చేస్తే పాపం పోతుందా, బీదరికం పోతుందా అంటూ కొందరు, అది కుంభమేళా కాదు మృత్యుమేళా అని మరొకరు, మురికిపట్టిన నదీజలాలు శవాలతో నిండి ఉన్నాయని వేరొకరు! ఇలా ఎందుకు అనవసరంగా మాట్లాడుతుంటారో?

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 55 కోట్లకు పైగా జనులు 45 రోజుల్లో తమ నమ్మకంతో ఓ చోట చేరినందుకా? లేక వేల సంవత్సరాల క్రితమే గ్రహగతులను కచ్చితంగా లెక్కలు గట్టిన రుషుల, ఖగోళ శాస్త్రవేత్తల మేధస్సుకా? దేనిమీద చూపుతు న్నారు వాళ్ల అక్కసు?

దళితులని ముద్ర వేసిన వారికి 1935 ప్రాంతంలో కేరళ దేవాలయాలలో దŠర్శనాలు ఏర్పాటు చేస్తే ఈ చర్య దరిమిలా హిందూస్థాన్ తమ మతవ్యాప్తికి తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలను గురించి చర్చ చేయడానికే వాటికన్‌లో పోప్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటయింది.

ఇప్పుడు కూడా అదే తరహాలో కుప్పలుతెప్పలుగా బయట నుండి వస్తున్న డబ్బుతో ఈ దేశంలో మత మార్పిళ్లకు తెగబడుతున్న లెక్కలేనన్ని మూకలకు తమ పని కష్టతరం అవుతుందనా?

1606లో క్రైస్తవ మత ప్రచారానికి గోవా మీదుగా మదురై చేరిన రాబర్ట్ డి.నోబ్లి (ఇటలీ) గుండు చేసుకొని, కాషాయం కట్టి, జంధ్యం ధరించి తత్వబోధ స్వామిగా మారి తెలుగు తమిళభాషల్లో పురాణాలు చెబుతున్నట్టు నమ్మిస్తూ మధ్యలో క్రీస్తు గురించి ప్రచారం చేసినట్టుగా (విశ్వనాథ వారి “ఏకవీర”లో కూడా ఉన్న విషయం) ఇప్పుడు తాజాగా చర్చిల్లో తళతళలాడే ధ్వజస్తంభాలు కూడా ఏర్పాటు చేయడం చూస్తున్నాం.

హిందువుల్లో రాబర్ట్ నోబ్లి లాంటి వారు ఎందరో పుట్టుకొచ్చారు.

‘రఘుపతి రాఘవ రాజారాం’ పాటను తెలివిగా కలుషితం చేసిన ఒక పెద్ద మనిషి ‘అహింసా పరమోధర్మః’ అని బోధించాడు కానీ, మహాభారతంలోని ఆ శ్లోకంలోని రెండో భాగం ‘ధర్మహింసా తదైవచ’ (ధర్మ రక్షణకై చేసే హింస అహింస కన్నా ఎంతో శ్రేష్టం) గురించి చెప్పలేదు.

ఆ ప్రకారమే పాండవుల చేత యుద్ధం చేయించి అధర్మానికి పాల్పడిన వారిని అంతం చేయించిన కృష్ణుని పాత్ర గురించి ఈ కోణంలోఎందుకు చెప్పరు?

ఇదే తరహాలో పవిత్ర గాయత్రీ మంత్రాన్ని కూడా ఎడారి మతాలవారు తమకు అన్వయించుకొని మార్పులు చేస్తుంటారు. మన శ్లోకాలు వగైరాలకు కూడా వక్రభాష్యం చెబుతుంటారు ఈ అబ్రహామిక్ మతాల వాళ్లు. వేదాల్లో కూడా వారి మతాల గురించి చెప్పినట్టు వికృత భాష్యాలు వెలయిస్తారు.

హిందూవులమనుకునే స్వయం ప్రకటిత మేధావులు, మేధావులమని భుజకీర్తులు తగిలించు కున్న వారు చేస్తున్న విష ప్రచారాలు హిందువులను నిత్యం కలత పెడుతున్నాయి. హంపిలో గుళ్లు ధ్వంసం చేసుకొన్నది హిందువులేనని ఒక మేధావి ఉవాచ. భగవద్గీతలోని ఒక్క శ్లోకాన్ని మాత్రమే తీసు కొని ఎవరేమి చేసినా హిందువులు సంయమనం పాటించాలని వాగృచ్చే ప్రొఫెసర్ మహాత్ముడు ఇంకొకరు.

భారతమాతను, సరస్వతీదేవిని నగ్నంగా చిత్రీక రించిన వారికి పద్మ పురస్కారాలు, రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టుతారు. చివరకు న్యాయవ్యవస్థ కూడా హిందువులకు బాధ కలిగే తీర్పులు ఇస్తూ ఉండడం శోచనీయం.

దీపావళి ముందు రోజున వందలాది పూజారు లను చంపినవాడు, లెక్కలేనన్ని గుళ్లని ధ్వంసం చేసిన, చేయించినవారు, హిందూ రాజులను కుట్రలతో బంధించి చిత్రహింసలు పెట్టి చంపిన వారు మహా గొప్ప వ్యక్తులుగా డాక్టరేటు మహాత్ములు కీర్తిస్తుంటారు. దేవుడు, మతం వంటివి నమ్మని కమ్యూనిస్టు పక్షాలు హిందువుల సంస్కృతి సాంప్ర దాయాల విషయంలో విపరీతంగా జోక్యం చేసుకుంటాయి.

ఒక్క శబరిమల గుడిలోకి ఆడవాళ్లకు ప్రవేశం లేకపోవడంతో స్త్రీలోకం ఎంతో కొల్పోతున్నట్టు వీరంగం చేశారు. కానీ ఆడవారిని ఇప్పటికీ అనుమతించని గ్రీసులోని మౌంట్ అతోస్ గురించి, ఇరాన్‌లో క్రీడామైదానాల గురించి నోరెత్తరు.

మూఢనమ్మకాల్ని ఖండించే జన విజ్ఞాన సంస్థ లకు, నాస్తిక సంఘాలకు హిందువులే లక్ష్యం. ఇలాంటి వర్గాలు ఏ మాత్రం బలహీనపడకుండా నిరంతరం వెనుక ఉండి అన్ని విధాలుగా ప్రోత్సా హాలు అందిస్తున్న శక్తులెవరు?

ప్రపంచంలోనే అతి పురాతన వేదాలు పుట్టిన గడ్డ ఇది. సున్నతో సహా అంకెలను కనుగొన్న ప్రాంతం. విజ్ఞానశాస్త్రంలోని అన్నీ శాఖలకు జన్మ నిచ్చిన భూమి. రేఖాశాస్త్రంతో, గణిత సూత్రాలతో, గ్రహగతుల కచ్చితత్వంతో ఘనమైన గుళ్లు అబ్బుర పరచే శిల్పశాస్త్రంతో నిర్మించిన మేధావులు నడయాడిన చోటిది.

దాదాపు పదివేల సంవత్సరాల నాడే లోహ విజ్ఞానంతో ఇప్పటి దక్షిణభారతాన ఇనుమును కొన్ని చెట్లను కాల్చగా వచ్చిన బొగ్గును (కర్బనం) నానో టెక్నాలజీ ద్వారా సమ్మేళనం చేసి అత్యంత దృఢమైన wశీశీtఓ stవవశ్రీ తయారు చేసిన విజ్ఞాన నేల ఇది.

పై తరహా ఉక్కు తయారీ విధానమే కాకుండా వేల టన్నుల బరువున్న శిలలను గోపురాలకు చేర్చి గుళ్లను నిర్మించిన కౌశలం, గాలిలోనే మూల విగ్రహాలను నిలిపి ఉంచడం, నాణ్యమైన అతి పలుచని వస్త్రాలను చేతులతో నేసిన ప్రావీణ్యత వంటివి ఎన్నెన్నో ఈ నాటి వైజ్ఞానిక జగత్తుకు కనీసం అంతు చిక్కడం లేదు.

అత్యంత పటిష్టమైన గురుకుల విద్యతో, నాగరికతతో బాటుగా ఎంతో సంపదలతో తులతూగిన హిందూ దేశంపై అనేకానేక జాతులు, దేశాలు నిరంతరం దాడి చేసి లెక్కకట్టలేనంత సంపదను దోచుకోవడమే కాకుండా వీలైనన్ని గుళ్లను నేలమట్టం చేశారు. అమూల్యమైన గ్రంథాలను నెలల తరబడి కాల్చి, ఎంతో విజ్ఞానాన్ని అగ్గిపాలు చేశారు.

ఎందరు ఎన్నిసార్లు దాడులకు పాల్పడి దాష్టి కాలకు తెగబడినా ఈ జాతి ‘సర్వేజనాః సుఖినో భవంతు’ అంటూ తాను నమ్మే వసుదైక కుటుంబ భావనతో అందర్నీ క్షమించి తన నేలపైనే చోటిచ్చి గౌరవించింది. ప్రపంచంలో ఏ దేశమూ ఆదరించని సమయంలో యూదులను అక్కున చేర్చుకొని గౌరవించింది. మన నుండి ఎంతో సాయం పొందిన బాంగ్లాదేశ్ వలె కాక ఏడు దశాబ్దాలుగా వారి వ్యతిరేకులకు మనం కొమ్ము కాసినా కానీ తమ రాజ్యాంగం పీఠికలో మన గురించి యూదులు గొప్పగా రాసుకున్నారు.

మన చరిత్ర పాఠాలలో ఊసు లేకుండా చేసినా అరబ్బీ, పర్షియన్, టర్కీ, చైనీయుల గ్రంథాల్లో విస్తృతంగా ప్రస్తావించిన ప్రపంచ విజేతలైన విక్రమాదిత్య, లలితాదిత్యలు ఏలిన దేశానికి మధ్యప్రాచ్య మతాల వలననే విజ్ఞానము, సంస్కృతి, నాగరికత అబ్బినాయనడం ఈ భూమి వయసు ఆరు వేల సంవత్సరాలే అని రాసుకున్న వారు చేసే వాదన ఎలావుందంటే బలవంతంగా స్వాధీనం చేసుకున్న రాజమహల్‌ను ప్రేమకానుకగా నమ్మిస్తున్నంత నిజం.

వేదాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ లేని సతీసహగమనం (అపరాధ భావనతో ప్రాణాలు తీసుకున్న మాద్రి తప్పించి) ముస్లిం రాజులు హిందూ స్త్రీలను మూకుమ్మడిగా చెరుస్తుంటే విధిలేక తమకు తామే అగ్నికి ఆహుతి అయ్యారు కానీ వారిని ఎవరూ బలవంతంగా భర్తల చితిమంటల్లోకి నెట్టలేదు.

1795లో హెన్రీ థామస్ కోల్ బ్రూక్ రుగ్వేదం తర్జుమా చేసే క్రమంలో ఒక పదానికి తప్పు అర్థం రాయడంతో వచ్చిన పదం ఈ సతి.

నిజానికి ప్రపంచంలో ఏ మతమూ ఇవ్వని ఎంతో ఉన్నత స్థానం స్త్రీకి ఇచ్చింది సనాతన ధర్మం. ఏ కార్యము తలపెట్టాలన్నా ముందు ఆలోచన చేసి ప్రణాళిక వేయడానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమే సరస్వతి.

వేసుకున్న ప్రణాళిక అమలుకు డబ్బులు కావాలి. ఆవిడే లక్ష్మి. సక్రమంగా విజయవంతంగా పని పూర్తి చేయాలంటే శక్తి కావాలి. ఇదే ఆదిశక్తికి ప్రతీక. జ్ఞానానికి, సంపదకు శక్తికి ఇలా అన్నింటికీ స్త్రీనే అధిదేవతగా నిలిపారు.

మాక్స్‌ముల్లర్ అరకొర సంస్కృతం నేర్చి మిడిమిడి జ్ఞానంతో వేదాలను తర్జుమా చేశాక తన భార్యకు వ్రాసిన ఉత్తరంలో విశాల హిందూదేశంలో సనాతన ధర్మం కుప్పకూలే స్థితిలో ఉందని, ఆ శూన్యాన్ని భర్తీ చేయకపోతే అది క్రైస్తవం తప్పు అవుతుందని తన అసలు ఉద్దేశం వెల్లడి చేశాడు.

హేతుబద్ధత లేని తల తిక్క ఆర్యద్రావిడ సిద్ధాం తాన్ని తెచ్చి హిందువుల మధ్య పొరపొచ్చాలు సృష్టించారు.

1849లో ఫ్రాన్సిస్ ఎల్లిస్, ఏ డి కేంప్ బెల్ వ్రాసిన తెలుగు వ్యాకరణం పుస్తకం, 1856లో రాబర్ట్ కాల్డ్ వెల్ పుస్తకంలో భాషకు, కులానికి సంబంధం అంట గట్టారు. బ్రాహ్మణులే కానీ మిగతావారు ముఖ్యంగా తమిళులు సంస్కృతం మాట్లాడరని సెలవిచ్చారు. వారు ప్రత్యేకం అని కూడా నుడివారు. ఈ విషపు ప్రచారమే జస్టిస్ పార్టీకి, తరువాత బ్రాహ్మణులను,సంస్కృతాన్ని, సనాతన ధర్మాన్ని ద్వేషించే పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ తమిళ సాహిత్యం చాలా వరకు బ్రాహ్మణులే రాశారన్న దానికి మౌనం వహించారు. మొత్తం ఐరోపాతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలను ఈ అబ్రహానిక్ మతాలు ఏభై,వందేళ్లలో పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి. దాదాపు పన్నెండు వందల ఏళ్లుగా అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినా ఈ దేశంలోని హిందూధర్మాన్ని అంతం చేయలేకపోయినందుకు నిత్యము అవాకులు చెవాకులు పేలుతుంటారు.

హిందువుల ఓట్లతో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక రాజకీయుడు ‘ఇదేమి హిందూమతం’ అంటాడు. ఇంట్లో అందరూ సంస్కృత పేర్లే పెట్టుకుని అధికార మదంతో సనాతన ధర్మాన్ని నిర్మూలన చేస్తామంటారు మరో మత కార్యక్రమంలో మాట్లాడుతూ! సాధువులు,సన్యాసులు హిందువులు కారని మరొక నేత ఉవాచ.

అవకాశం వస్తే పది నిముషాల్లో హిందువులను చంపేస్తామని మరొకడు బహిరంగంగా సవాలు చేస్తాడు. వీటిని మాత్రం ఏమాత్రం పట్టించుకోని అత్యున్నత న్యాయస్థానం ఎక్కడో ఏ మూలో హిందువు ఏదో అనేశాడని స్వయం ప్రేరిత వాజ్యం నమోదు చేసి విచారణ చేస్తుంటుంది.

అనేక దాడుల తరువాత పునర్నిర్మించిన సోమనాథ దేవాలయ ప్రారంభోత్సవానికి పోకుండా అందర్నీ కట్టడి చేసినా కూడా రాష్ట్రపతి హోదాలో హాజరైన మన మొదటి రాష్ట్రపతి మరణించిన వేళ అంత్య క్రియలకు తానూ హాజరు కాకుండా అప్పటి రాష్ట్రపతిని కూడా పోకుండా చేసిన ప్రధాని ఏలిన దేశం ఇది.

ఎవరి భయంతో తాము హిందూదేశానికి స్వతంత్రం ఇచ్చామో స్వయంగా నాటి బ్రిటిష్ ప్రధాని చెప్పినా అతని ఊసు లేని చరిత్ర రాయించారు. అంతేకాక అతను ఏర్పాటు చేసిన విప్లవసైన్యాన్ని వెంటాడి రూపు మాపారు.

సెక్యులరిజం అంటే అల్పసంఖ్యాక మతాల వారు హిందువులను ఏమైనా చేయవచ్చు/అనవచ్చు కానీ హిందువు ఎవరేమన్నా ఏంచేసినా నోరెత్త కూడదనే భావనను పెంచి పోషించారు.

ముస్లిములు తరిమేసిన హిందువులు, మళ్లీ దయతలచి తరిమేసిన వాళ్లే ఆహ్వానించి, రాష్ట్రంలో ఉండమంటేనే రావాలన్న 1924లో చెప్పిన వ్యక్తి తాలూకు భావజాలానికి వారసులైన ఒక రాజకీయ పక్షం ఆస్తులను,ఆడవారిని దోచుకొని కట్టుబట్టలతో తరిమేస్తే స్వదేశంలోనే కాందిశీకులైన కశ్మీరీ పండితుల విషయంలో మౌనం వహిస్తారు.

అదే రాజకీయ పక్షం హిందువుల ఆలయాలను ఆలయ భూములను ఆక్రమించిన సంభాల్ ప్రాంతంలో ముస్లిములను పరామర్శించడానికి మందీ మార్బలంతో బయలుదేరుతారు.

1975లో మొత్తం మంత్రివర్గంలో ఏకైక ‘మగవాడు’గా ముద్రపడిన మనిషి తన ప్రయోజనాల కోసం దేశాన్ని అత్యవసర పరిస్థితుల్లోకి నెట్టేసి గుట్టు చప్పుడు కాకుండా సెక్యులరిజం, సోషలిస్టు పదాలు రాజ్యాంగ పీఠికలోకి చొప్పించారు.

ఐరోపా దేశాల్లో 800 ఏళ్లనాడు చర్చికి, రాజుకు మధ్య అనేక విధాలుగా ఘర్షణలు చోటు చేసుకుంటే చాలా సంప్రదింపుల తరువాత ఏర్పడ్డ ఒడంబడిక పేరే ‘సెక్యులరిజం’. అప్పుడే క్రైస్తవం కేథáలిక్కులుగా, ప్రొటెస్టెంట్లుగా కూడా విడిపోయింది.

దీని ప్రకారం రాజు లేక దేశాధినేత తప్పకుండా క్రైస్తవుడు అయినప్పుడు, అతడు కేథలిక్ అయినా ప్రొటెస్టంటు అయినా అందర్నీ గౌరవిస్తూ రెండు శాఖలకు సమానదూరంలో ఉండాలని నిర్దేశించిందే ఇది. ఇది కేవలం క్రైస్తవ దేశాలకు, సంఘాలకు మాత్రమే సంబంధించిన వ్యవహారం.

ఇలాంటి పదాన్ని సమూలంగా అర్థం మార్చి మన దేశానికి దిగుమతి చేసి హిందువులపై రుద్దారు. చావు మంచంపై ఉన్న వ్యక్తినీ మతం మారమని ఒత్తిడి చేసే మూకలు విదేశాల్లో ఎవరూ బలవంతం చేయకున్నా లెక్కలేనంత మంది హిందూధర్మం వైపు అడుగులు వేస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఒరిస్సాలోని మంగ్లాదేవి ఆలయానికి వస్తుంటారు. మార్గ్ జాకర్ బర్గ్ (మెటా సంస్థ) ఉత్తరాఖండ్‌లోని కరోలీబాబా భక్తుడు. హాలివుడ్ నటి ఎంజిలినా జోలి విష్ణుభక్తు రాలు. క్రికెటర్ డేవిడ్ వార్నర్ రాముడే తన దేవుడని అంటారు. ఆపిల్ సంస్థ టిమ్ కుక్ కు గణపతి అంటే ఎంతో ఇష్టం. తన ఇంట్లో, కార్యాలయంలో ప్రతి చోటా గణపతి ప్రతిమలు ఉంచాడు.

ఇలా ప్రపంచంలో చాలా దేశాల్లో సామాన్యులు సైతం సనాతనధర్మం వైపు వస్తుంటే ఈ దేశంలోని వారు ఆ విషయాల గురించి మీడియాలో రాదు.

దేశంలోని అన్ని వ్యవస్థలు, రాజ్యాంగము లోని 25 నుండి 30వ అధికరణాలతో సహా హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తుండడం విచార కరం. పైగా 1991సం. ప్రార్థనా స్థలాల యథాస్థితి చట్టం తెచ్చి ఆక్రమణలోని మన గుడుల కోసం న్యాయస్థానం మెట్లు కూడా ఎక్కకూడ దంటారు.

అన్ని మత విషయాలకు సమాన దూరం పాటిస్తే హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం మాత్రమే ఎందుకు? ఇప్పుడు అందులో హిందూ పదం కూడా తొలగించారు. అసలు కేవలం హిందూ గుడుల ఆస్తులు, సంపదలు, కానుకలపైనే ప్రభుత్వాలు ఎందుకు అజమాయిషీ చేస్తుంటాయి. దర్శనానికి రకరకాల పేర్లతో డబ్బులు వసూలు చేయడం ఏమిటి? ఆలయాల ఆదాయం కేవలం హిందూ గుళ్లకి, సమాజానికి మాత్రమే ఖర్చు చేయటం లేదు ఎందుకు?

1935లో బ్రిటన్ పార్లమెంటు పంపిన భారత ప్రభుత్వ చట్టం అతి చెత్త అన్నవారే దాని నుండే సింహభాగం భారత రాజ్యాంగంలోకి తీసుకోవడం ఎందుకు జరిగింది?

26 మంది ఆర్చ్ బిషప్పులకు అక్కడ హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో స్థానం కల్పించినప్పుడు ఇక్కడ ఎందుకు అత్యధిక హిందువుల సమాజానికి ఆ అవకాశం ఇవ్వలేదు?

హిందూ దళితులకు మాత్రమే కల్పించిన రిజర్వేషన్లు మతం మారిన ఎందరో దశాబ్దాలుగా అనుభవించడం ఏమిటి? హిందువుల్లోని కులవ్యవస్థ గురించి మాట్లాడుతారు గానీ ఇతర మతాల్లోని భేదాల గురించి మాట్లాడరు ఎందుకు?

అన్ని మతాలవారు వారి మతబోధనలతో పాఠశాలలు నిర్వహించుకోవచ్చు గానీ హిందువులకు ఆ అవకాశం లేదెందుకు?

మన దేశంకు స్వరాజ్యం వచ్చిందేమో కానీ దేశంలోని హిందువులకు స్వాతంత్య్రం రాలేదు. ఇంకా ఎంతకాలం ఈ మానసిక బానిసత్వపు సంకెళ్లు?

గడ్డం దేవీప్రసాద్

8971830473