
విద్యాబోధనలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను విద్యార్థులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న తరగతి గదులను డిజిటల్ తరగతి గదులుగా మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రానున్న బడ్జెట్‌లో రూ.118.89 కోట్లు పొందుపర్చింది. తరగతి తగదులను ఆధునికీకరించడంతోపాటు విద్యార్థులకు అవసరమైన వసతి, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు టీటీడీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఏమేం చేస్తారంటే..
టీటీడీ ఆధ్వర్యంలో ప్రస్తుతం 31 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. టీటీడీ పాఠశాలలు, కళాశాలల్లోని తరగతి గదులను డిజిటల్ క్లాస్‌రూమ్‌లుగా మారుస్తారు. ఇందుకోసం ఆయా క్లాస్‌రూమ్‌లలో ఇంటర్‌యాక్టివ్ ప్యానల్ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం సుమారు 260 గదులు ఉన్నట్లుగా గుర్తించారు. ఒక్కో ప్యానల్ బోర్డు ఏర్పాటుకు సుమారు రూ.2లక్షలు ఖర్చవుతుందని, మొత్తంగా రూ. 5.20 కోట్లు అవసరమని అంచనా వేశారు. మరోవైపు పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల డేటా, అడ్మిషన్లు, అటెండెన్స్, ఫీజు, పరీక్షలు ఇలా అన్ని అంశాలను ఒకే దగ్గరకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడం/అవసరమైతే కొనుగోలు చేసేందుకు టీటీడీ అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే ఆయా విద్యాసంస్థల్లో అవసరమైన కంప్యూటర్లను అందుబాటులోకి తేనున్నారు.





