
ఉమ్మడి విజయనగరంజిల్లాలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇక్కడి సంతల్లో కొనుగోలు చేసి కంటైనర్లు, లారీల్లో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి ఇక్కడకు తీసుకొస్తున్నారు. విజయనగరం, ఎస్.కోట, పార్వతీపురం, సాలూరు, ఒడిశా సరిహద్దుల్లో ఉన్న వధ శాలలకు తరలిస్తున్నారు. ఇలా ఏటా రెండు జిల్లాల్లో రూ.100 కోట్లకు పైగా వ్యాపారం సాగుతున్నా.. యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోందనే ఆరోపణలున్నాయి.
దండిగా లాభాలు..
పొరుగు రాష్ట్రాల్లో ఆ స్థాయిలో పశు సంపద ఉండదు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు తరలించాలంటే మార్గమధ్యలో సుమారు 200 పోలీసు స్టేషన్లను దాటాల్సిందే. ఒక్కో కంటైనర్‌లో వందకు తగ్గకుండా కుక్కేసి మరీ ఎక్కిస్తున్నారు. గమ్యానికి చేరేలోపు కొన్ని మరణిస్తుండగా.. మరికొన్నింటికి కాళ్లు విరిగిపోతున్నాయి. అయినప్పటికీ వధించి, దండిగా లాభాలు సంపాదిస్తున్నారు.
నెలవారీ వసూళ్లు..
సంతల్లో నిఘా, జాతీయ రహదారులు, ప్రధాన మార్గాల్లో తనిఖీలకు ప్రత్యేక కమిటీలు వేశారు. పశు అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కొందరు నెలవారీ వసూళ్లకు పాల్పడుతూ పట్టుబడిన లారీలను వదిలేస్తున్నారు. ప్రతినెలా పలు స్టేషన్లకు డబ్బులిస్తున్నారని రాష్ట్ర గోసంరక్షణ సమాఖ్య అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ చెబుతున్నారు. ఇటీవల మానాపురం సమీపంలో కంటైనర్ ఉన్నా.. పోలీసులు పట్టుకోలేకపోయారన్నారు.
అనధికారికంగా నిర్వహణ..
విజయనగరంలో 18, పార్వతీపురంలో 20, బొబ్బిలి పట్టణ పరిసరాల్లో అయిదు, మిగిలిన ప్రాంతాల్లోనూ ఒకటి, రెండు చొప్పున కబేళాలు ఉన్నాయి. వీటిల్లో ఒక్కదానికీ అనుమతులు లేవు. ఆ మధ్య నిర్వాహకుల డిమాండుతో జిల్లా కేంద్రంలో తొమ్మిదింటికి అనుమతులిచ్చారు. స్థానికుల ఆందోళనతో రద్దు చేశారు. కానీ నేటికీ కొనసాగుతున్నాయి. జామి మండలం అలమండ, దత్తిరాజేరు మండలం పెదమానాపురం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, శ్రీకాకుళం జిల్లాలోని బుడుమూరు, పైడిభీమవరం సంతల నుంచి ఇక్కడకు తీసుకొస్తున్నారు. కిలో రూ.350 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నారు. విదేశాల్లో రూ.వేలల్లో పలుకుతోంది.





