News

ప్రకృతి సాగుతో ఆదాయం, ఆరోగ్యం

129views

ప్రకృతి వ్యవసాయంతో ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వ్యవసాయం భారం కాకుండా లాభసాటి కావాలంటే ప్రకృతి సాగే సరైన విధానమని స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయంపై వర్క్ షాప్ లో పాల్గొని ప్రసంగించారు.

ప్రకృతి సాగుపై వర్క షాప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశంలోనే అత్యధిక మంది జీవనాధారం వ్యవసాయమన్నారు. ప్రస్తుతం ఎరువులు, పురుగు మందుల ధరలు పెరుగుతుండడంతో, వ్యవసాయ పెట్టుబడి భారంగా మారిందన్నారు. వ్యవసాయంలో ఖర్చును తగ్గిస్తూ, లాభాలు పెంచడానికి ప్రకృతి సాగు ఎంతో దోహదపడుతుందన్నారు. రసాయనాలపై ఆధారపడకుండా సహజ వనరులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చొచ్చునన్నారు. అటు ఆరోగ్యం, ఇటు ఆదాయం ప్రకృతి వ్యవసాయం వల్లే సాధ్యమవుతుందన్నారు. జీవామృతం, ఘన జీవామృతం వంటి సహజ వనరుల వినియోగంతో నేల సారం పెరుగుతుందన్నారు.

కరోనా నుంచి ప్రజల ఆహారపు అలవాట్లు మారాయని, ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందని అన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తులు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఆర్గానిక్ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండొచ్చునన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తులకు అధిక ధరతో పాటు డిమాండ్ కూడా ఎక్కువేనన్నారు. రైతులు ప్రకృతి సాగుపై దృష్టి సారించి, అధిక లాభాలు సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయిలోనూ ఇటువంటి వర్క్ షాపులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ రైతు సాధికార సమితి వైస్ చైర్మన్ టి.విజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య 60 లక్షలకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ సంక్షేమ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.సునీత మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయంపై ఆర్థిక వెనుకబడిన వర్గీయులను మొగ్గుచూపేలా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందు సేంద్రీయ ఎరువులతో సాగుచేసిన కూరగాయలు, అపరాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సవిత పరిశీలించారు. ఏయే సహజ వనరులు వినియోగించి ప్రకృతి సాగు చేశారో అడిగి తెలుసుకుని, రైతులను అభినందించారు. అనంతరం వర్క్ షాప్ ను మంత్రి సవిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు బుచ్చి రాంప్రసాద్, బ్రహ్మం చౌదరి, డూండీ రాకేశ్, ఈడబ్ల్యూఎస్ అధికారులు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గానికి చెందిన రైతులు పాల్గొన్నారు.