
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యను ఖండిస్తూ బెంగళూరులో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇది చట్టపరమైన వివాదానికి దారితీసింది. నగరంలో బహిరంగ సభల లాంటి వాటి విషయంలో కోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా నిరసన నేపథ్యంలో ఆ మార్గదర్శకాలను ఉల్లంఘించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ నిరసనల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే హారిస్ కూడా వున్నారు. అతడిపై ఫిర్యాదులు వచ్చాయి.
ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడిలో టెహ్రాన్‌లో ఖమేనీ హత్యకు గురైనట్లు వచ్చిన వార్తలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ షియా ముస్లిం సమాజం మరియు అనేక సంస్థలు ఈ నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
బెంగళూరులోని రిచ్మండ్ టౌన్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు హత్యను ఖండిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అధికారులు అనుమతులు కూడా తీసుకోలేదు. అంతేకాకుండా నిరసన కార్యక్రమాలు ఎక్కడైతే నిర్వహించాలో అక్కడ కాకుండా వేరే స్థలంలో నిర్వహించారు.
కర్ణాటక హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం, బెంగళూరులో ప్రజా నిరసనలు మరియు ప్రదర్శనలు ఫ్రీడమ్ పార్క్ వద్ద మాత్రమే నిర్వహించాలి. నగరంలో ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించడానికి, ప్రజల రక్షణ కోసం ఈ నిర్ణయం ప్రకటించింది. అనుమతి లేకుండా ఇతర ప్రాంతాలలో ర్యాలీలు లేదా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించినట్లుగానే పరిగణిస్తారు.
ఈ విషయం తెలిసి కూడా ఖమేనీ హత్యను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ విషయం హైకోర్టు దృష్టికి కూడా వెళ్లింది. ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న వారిపై ఇప్పుడు చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలకు హిందూ సంస్థ డిమాండ్…
హైకోర్టు ఆంక్షలు, చట్టం తెలిసి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే హారిస్ ఈ నిరసనల్లో పాల్గొన్నారని, వెంటనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థ కార్యకర్త తేజస్ గౌడ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫ్రీడమ్ పార్క్ వెలుపల జరిగిన ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా హారిస్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని గౌడ ఆరోపించారు.





