News

సమష్టి కృషితో రామయ్య బ్రహ్మోత్సవాలు

120views

టీటీడీలోని అన్ని విభాగాలు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమిష్టి కృషితో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, ఎస్పీ ఎస్‌. నచికేత్‌ విశ్వనాథ్‌ పిలుపునిచ్చారు. ఒంటిమిట్ట రామయ్య బ్రహ్మోత్సవాలపై  స్థానిక టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం ఆధ్వర్యంలో కలెక్టర్‌, ఎస్పీ, టీటీడీ, జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 5 వరకు జరిగే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా ఏప్రిల్‌ 1న జరిగే సీతారాముల కల్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన లోటుపాట్లను సవరించుకుని శ్రీ సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. ఈ కల్యాణానికి ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారని వెల్లడించారు. టీటీడీ అధికారులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.అంతకుముందు జేఈవో వీరబ్రహ్మం రామయ్య కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.