
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మార్చి 26న అంకురార్పణ, మార్చి 27న శ్రీరామనవమి పర్వదినం, ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం-టిటిడి జేఈవో వి.వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం, కల్యాణ వేదికల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి జేఈవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
‘‘కల్యాణం రోజున వచ్చే వేలాది మంది భక్తులకు అవసరమైన అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించేందుకు చక్కటి ఏర్పాట్లు చేయాలి. అన్ని విభాగాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని కల్యాణం రోజున భక్తులకు అందాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కల్పించేందుకు భక్తులు నడిచే ప్రాంతాల్లో కూల్ పెయింట్ వేయాలి. అవసరమైన చోట్ల చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలి. ఊరేగింపు నిర్వహించే వాహనాలు, రథానికి సంబంధించిన పటిష్టతను పరిశీలించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు వీలుగా అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసి తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళిక త్వరితగతిన సిద్ధం చేయాలన్నారు. కల్యాణం రోజున భక్తుల రవాణా, వసతి, పార్కింగ్ కల్పించేందుకు ఆర్‌టీసీ అధికారులతో సమన్వయం చేసుకోవాలి. అన్ని విభాగాల అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉండి కడప జిల్లాలోని ఆయా విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలి’’ అని అధికారులను ఆదేశించారు.





