
సంస్కృత భాషా కార్యక్రమంపై ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని దక్షిణాసియా అధ్యయన విభాగం చేసిన పోస్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో విశ్వవిద్యాలయం క్షమాపణలు చెప్పింది. హార్వర్డ్‌లోని దక్షిణాసియా అధ్యయన విభాగం ప్రాథమిక, ఇంటర్మీడియట్, ఉన్నతస్థాయులలో కొన్నేళ్లుగా సంస్కృత కోర్సులను అందిస్తోంది. ఇందులోభాగంగా ఎలిమెంటరీ సంస్కృత కోర్సును ప్రోత్సహించడానికి ఓ పోస్టర్‌ను రూపొందించి దాన్ని ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్టర్‌లో కృష్ణుడి చిత్రాన్ని చూపించిన తీరుపై పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా యూనివర్సిటీ అధికారులు పోస్టర్‌ను రూపొందించారని నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది.
దీనిపై స్పందించిన హార్వర్డ్‌లోని దక్షిణాసియా అధ్యయన విభాగం క్షమాపణలు చెప్పింది. సంస్కృత భాషా కార్యక్రమానికి సంబంధించిన అనుచిత పోస్టర్‌ను రూపొందించినందుకు తాము చింతిస్తున్నామని తెలిపింది. సంస్కృతాన్ని బోధించడంలో తమ విభాగానికి సుదీర్ఘ చరిత్ర ఉందని.. భాష, సంస్కృతి, సంప్రదాయాల సంరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది




