
నక్సలైట్ల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అనేక మంది నక్సలైట్లు హతమవ్వడంతో పాటు భారీ సంఖ్యలో లొంగిపోయారు కూడా. అయితే.. ఈ ఆపరేషన్ కగార్ తో మరో ముఖ్యమైన పని కూడా జరిగింది.
నక్సలైట్ల ప్రభావం అధికంగా వుండే ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో దీని ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది. 650 మీటర్ల ఎత్తులో వున్న ఓ కుగ్రామానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి సారిగా కరెంట్ సరఫరా వచ్చింది. కొన్ని దశాబ్దాల పాటు గోగుండ అనే గ్రామం కమ్యూనిస్టుల చేతిలో వుండేది. కనీసంలో కనీసం ఈ గ్రామానికి విద్యుత్ సరఫరా కూడా వుండేది కాదు. కానీ… ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.. ఈ గ్రామంలో పరివర్తన ప్రారంభమవుతోంది.
నిజానికి గోగుండకు విద్యుత్తును అందించడం కేవలం ప్రాథమిక సౌకర్యం కంటే ఎక్కువ అని భావిస్తున్నారు. నిజానికి ఇది విస్తృతమైన సామాజిక పరివర్తనకు నాందిగా మారుతుందని భావిస్తున్నారు. అక్కడి కలెక్టర్ ఈ ప్రాంతంలో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (FOB) స్థాపన తర్వాత అభివృద్ధి వేగం పుంజుకుంది. ఒకప్పుడు అసలు ఏ మాత్రం మౌలిక సదుపాయాలు లేని గ్రామం ఇప్పుడు రోడ్లను చూస్తోంది.కరెంటును కూడా చూస్తోంది. విద్యుత్ లైన్లను మరింత విస్తరిస్తున్నారు.
ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) దుకాణాలు మరియు కమ్యూనిటీ హాళ్లు వంటి సుపరిపాలన సముదాయాల కింద నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. రానున్న రెండు నెలల్లోనే పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే స్థానిక డిమాండ్ ప్రకారం ఓ చిన్న మార్కెట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో తమ నిత్యావసరాల నిమిత్తం పట్టణాలకు వెళ్లేవారు. అలాగే ఆ ప్రాంతంలోని వారికి తరుచుగా ఇప్పుడు వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తోంది ప్రభుత్వం.
పోలీసులు, భద్రతా దళాల వ్యూహంతో….
ఇన్ని సంవత్సరాల పాటు నక్సలైట్ల చేతిలో ఈ గ్రామం వుండేది. కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని దుస్థితిలో ప్రజలు వుండిపోయారు. ప్రభుత్వం కూడా కాస్త అటూ ఇటుగానే సదుపాయాల విషయంలో ప్రజలను చైతన్యపరుస్తూనే వున్నారు. అయినా నక్సలైట్ల ప్రభావంతో అవి సాధ్యం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందో, పరిస్థితులు మారిపోతున్నాయి. స్థానిక పోలీసు శాఖ, కేంద్ర భద్రతా బలగాలు తమ వ్యూహాలను మార్చుకున్నాయి. గోగుండ ప్రాంతంలో భద్రతా శిబిరాల అవుట్ పోస్టులను విరివిగా ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామస్థులకు మౌలిక సదుపాయాలన్నీ వరుసగా వచ్చేస్తున్నాయి. అభివృద్ధికి మార్గం సుగుమమవుతోంది.
ఇక.. గ్రామస్థులు తెగ సంతోషం వ్యక్తమవుతోంది. తమ జీవితాల్లో మౌలికమైన మార్పును చూస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. చాలా మంది దశాబ్దాలుగా చీకటిలో కిరోసిన్ దీపాలు, టార్చిలైట్లపై ఆధారపడి జీవించామని పేర్కొంటున్నారు. సిఆర్‌పిఎఫ్ శిబిరం ఏర్పాటుతో, రోడ్లు, నీటి సరఫరా మరియు విద్యుత్ మొదటిసారిగా గ్రామానికి చేరుకున్నాయి.
అలాగే ప్రభుత్వం కూడా అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తోంది. పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్, తాగునీటి సౌకర్యాలు లాంటి వసతులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల సమన్వయం ద్వారా గోగుండ వంటి మారుమూల గ్రామాలు కూడా ఇప్పుడు పరివర్తనలో వున్నాయి.





