
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు భారత్ మరోసారి చురకలు అంటించింది. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని చూడలేదంటే పాక్ ఊహల్లో విహరిస్తూ ఉండొచ్చంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. అలాగే జమ్మూకశ్మీర్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో భారత దౌత్యవేత్త అనుపమాసింగ్ స్పందించారు.
‘‘జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. పాక్ ప్రచారం ఆ వాస్తవాన్ని మార్చలేదు. ఆ దేశం చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాలను ఖాళీ చేయాలి. పాక్ ప్రచారం చేస్తోన్న ఉగ్రవాద భావజాలాన్ని జమ్మూకశ్మీర్ ప్రజలు తిరస్కరిస్తున్నారనడానికి.. సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ నమోదైన రికార్డు స్థాయి ఓటింగే నిదర్శనం. అక్కడి ప్రజలు అభివృద్ధి, ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు వెళ్తున్నారు. గత ఏడాది అక్కడ ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ రైల్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. అది నకిలీదని భావిస్తే.. పాకిస్థాన్ ఊహల్లో బతుకుతున్నట్లే. జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం కేటాయించిన బడ్జెట్.. ఐఎంఎఫ్ నుంచి దాయాది కోరిన బెయిలౌట్ ప్యాకేజీ కంటే రెట్టింపే. అది కూడా వారికి నమ్మశక్యం కాకపోవచ్చు’’ అని సింగ్ విమర్శించారు. ప్రజాస్వామ్య ప్రక్రియ గురించి ఆ దేశం ఉపన్యాసాలు ఇవ్వడం చిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు.





