News

హర్యానా వేదికగా ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ బైఠక్

101views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ ఈ సారి హర్యానాలోని సమల్ఖా వేదికగా జరగనుంది. సమల్ఖాలోని పట్టి కల్యాణలోని గ్రామ వికాస్, సేవా సాధన కేంద్రంగా మార్చి నెల 13,14,15 తేదీల్లో జరగనుంది. ఈ మేరకు ఆరెస్సెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆరెస్సెస్ దృష్టి కోణంలో ఇది అత్యున్నత నిర్ణయాలు తీసుకునే సమావేశం.

ఈ యేడాది సంఘ కార్య శతాబ్ది నేపథ్యంలో ఈ సమావేశాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. కార్య శతాబ్ది సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు అనగా విజయ దశమి వేడుక, గృహ సంపర్క్, యువ సమ్మేళనాలు, ప్రముఖుల గోష్ఠి, సామాజిక సద్భావనా బైఠక్ తో పాటు సామాజిక సమరసత సమావేశాలతో పాటు మరికొన్ని కార్యక్రమాల విషయంలో అనుభవాలతో పాటు మరికొన్ని విశేషమైన వాటిపై చర్చించనున్నారు. అలాగే 2025-2026 సంవత్సరపు పనిని కూడా ఇందులో సమీక్షించనున్నారు.

ఇక.. ఈ సమావేశాల్లో ప్రస్తుత జాతీయ అంశాలను చర్చించి, ముఖ్యమైన అంశాలపై తీర్మానాలను చేసి, ఆమోదిస్తారు. సంఘ శాఖల ద్వారా సామాజిక మార్పు ప్రయత్నాలపై, ముఖ్యంగా పంచపరివర్తన్ పై మరింత లోతుగా చర్చిస్తారు. ఈ అంశాలతో పాటు సంఘ శిక్షావర్గలతో పాటు ఇతర వర్గలపై కూడా చర్చించనున్నారు. అలాగే రాబోయే సంవత్సరానికి సంఘ కార్య ప్రణాళికలను కూడా నిర్ణయిస్తారు.

ఈ సమావేశంలో ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే, సహ సర్ కార్యవాహలతో పాటు ఇతర అధికారులు, కార్యకారిణి సభ్యులు పాల్గొంటారు. మొత్తం 1,489 మంది ప్రతినిధులు, 32 సంఘ్ ప్రేరేపిత సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటారు.

గత యేడాది బెంగళూరు వేదికగా….
గత యేడాది అఖిల భారతీయ ప్రతినిధి సభ బెంగళూరు వేదికగా జరిగింది. మార్చి 21 నుంచి 23 వ తేదీ వరకూ జరిగింది. చన్ననహల్లిలోని జనసేవ విద్యాకేంద్రలో జరిగాయి. ఈ సమావేశాల్లోనే బంగ్లాదేశ్ లోని హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, అణచివేతపై ABPS తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కూడా ఆమోదించింది.