మహారాష్ట్ర నాగ్‌పుర్ జిల్లాలోని కోరాడిలో గల మహాలక్ష్మి జగదాంబ సంస్థాన్ ఆధ్వర్యంలో దేశంలోనే అత్యంత ఎత్తైన, అత్యంత భారీ హనుమంతుడి విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఈ హనుమాన్ విగ్రహం 158 అడుగుల ఎత్తు ఉంటుంది. దిగువ పీఠం నుంచి పైభాగం వరకు దీని మొత్తం ఎత్తు 163 అడుగులుగా ఉంటుందని నిర్మాణ సంస్థ చెబుతోంది. ప్రస్తుతం దేశంలోనే ఎత్తైన విగ్రహం హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో ఉండడం గమనార్హం.
నాగ్‌పూర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే ఈ హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు పరిపాలనా అధికారులు కూడా పాల్గొన్నారు. నాగ్‌పూర్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్, నాగ్‌పూర్ మహానగర ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ద్వారా దీని అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా లేజర్ ప్రొజెక్షన్ మ్యాపింగ్, అండర్ వాటర్ లైటింగ్ (నీటి అడుగున విద్యుత్ దీపాలు), బటర్‌ఫ్లై గార్డెన్ నిర్మాణాలను చేపట్టనున్నారు. దీనితో పాటు, దేశవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వచ్చేలా ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పర్యాటక ప్రదేశాన్ని కూడా నిర్మిస్తామని అధికారులు తెలిపారు. ఇక్కడ 500 మంది పిల్లల కోసం హాస్టల్‌ను కూడా నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
రికార్డు!
దేశంలోనే ఎత్తైన ఈ విగ్రహం కనుక పూర్తయితే ‘ప్రపంచ రికార్డు’ సృష్టించే అవకాశం ఉందని సదరు అధికారులు తెలిపారు. దీని నిర్మాణంలో ఆర్‌సీసీ సిమెంట్ కాంక్రీట్, జింక్ కోటింగ్ మెటాలిక్ పెయింట్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ పెయింట్ ఏ విధమైన వాతావరణ పరిస్థితుల వల్ల కూడా పాడవదు. దీనికి ఎలాంటి నిర్వహణ చేయాల్సిన అవసరం ఉండదని వారు చెబుతున్నారు.
“హనుమాన్ విగ్రహం మూడు నెలల్లో పూర్తి కానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది” అని ఇన్‌ఛార్జ్ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే తెలిపారు.
మే నాటికి పనులు పూర్తి!
‘అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ విగ్రహానికి సంబంధించిన పనులు ఇప్పటికే 60 శాతం పనులు వరకు పూర్తయ్యాయి. విగ్రహం ఎత్తు దృష్ట్యా, ఇది చాలా దూరం నుంచే పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. విగ్రహం ఉపరితలంపై అక్రిలిక్ పెయింట్‌ను వేయనున్నారు’ అని అధికారులు తెలిపారు. శిల్పి జతిన్ కుమార్ ప్రకారం, ఈ విగ్రహాన్ని ‘మెయింటెనెన్స్ ఫ్రీ’ (నిర్వహణ అవసరం లేని) ప్రాతిపదికన నిర్మిస్తున్నారు. ఈ విగ్రహ నిర్మాణానికి 178 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 140 టన్నుల ఇనుమును ఉపయోగించారు. విగ్రహం మొత్తం బరువు 281 టన్నులు. మే నాటికి ఈ పనులు పూర్తవుతాయని అంచనా. హనుమాన్ విగ్రహం సరస్సు మధ్యలో ఉన్నందున, విగ్రహం వద్దకు చేరుకోవడానికి బోటు ఏర్పాటు చేస్తారు. లేజర్ షోతో సహా పర్యాటక కేంద్రంలో అనేక ముఖ్యమైన నిర్మాణాలు చేయనున్నారని అధికారులు తెలిపారు.
దేశంలోనే ఎత్తైన విగ్రహం
ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మడపం గ్రామంలో ఉన్న విగ్రహం నిలిచింది. వంశధార నది తీరాన కొలువై ఉన్న ఈ విగ్రహం సుమారు 176 అడుగుల ఎత్తు ఉంటుంది. అయితే, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సమీపంలో గల కోరాడి వద్ద నిర్మిస్తున్న హనుమాన్ విగ్రహం త్వరలోనే ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. కోరాడిలోని శ్రీ మహాలక్ష్మి జగదాంబ సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ విగ్రహం మొత్తం ఎత్తు (పీఠంతో కలిపి) 188 అడుగులకు చేరుకోనుంది. 2026 జూన్ నాటికి ఈ భారీ ప్రాజెక్టు పూర్తికావచ్చని అంచనా.
వీటితో పాటు కర్ణాటకలోని బిదనగెరెలో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం (161 అడుగులు), హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ విగ్రహం (157 అడుగులు), ఆంధ్రప్రదేశ్‌లోని పరిటాల వీరాంజనేయ స్వామి విగ్రహం (135 అడుగులు) దేశంలోని ఇతర ఎత్తైన విగ్రహాల జాబితాలో నిలుస్తున్నాయి. ఈ విగ్రహాలన్నీ కూడా అత్యున్నత ఇంజనీరింగ్ నైపుణ్యంతో, పర్యాటకులను, భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.





