News

అన్నప్రసాదం విస్తర్లపై అన్యమత ప్రచారం

164views

తూర్పుగోదావరి జిల్లా గోకవరం వేంకటేశ్వరస్వామివారి అన్నసమారాధనలో అన్యమత ప్రచారానికి సంబంధించిన విస్తర్లు వినియోగించడంపై భక్తులు మండిపడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించిన వివరాలివీ..

తంటికొండ గ్రామంలో వెంకటగిరిపై వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు ప్రతి శనివారం జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం వద్ద అన్నసమారాధన నిర్వహిస్తారు. శనివారం నిర్వహించిన అన్నసమారాధనలో ఉపయోగించిన విస్తర్లను చూసి భక్తులు ఖంగుతిన్నారు. ఎందుకంటే ఆ విస్తర్లపై ఆంగ్ల అక్షరాలతో మేరీ క్రిస్మస్ అని రాసి ఉంది. అన్యమతానికి సంబంధించి విస్తర్లను దేవస్థానాలలో అన్నసమారాధనకు ఏవిధంగా ఉపయోగిస్తారంటూ అక్కడ ఉన్న సిబ్బందిని నిలదీశారు.

గతంలోను ఇదేవిధంగా ఆకులను వినియోగించిన సంఘటనను గుర్తు చేశారు. మీ నిర్లక్ష్యం కారణంగా దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింటుందని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఈవో అక్కడకు చేరుకొని విస్తర్లను తొలగించారు. వంట గదిలో ఉన్న మిగిలిన విస్తర్లను ధ్వంసం చేయాలని పట్టుబట్టడంతో కొంత వివాదం నెలకొంది. దీనిపై దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్నదొరను వివరణ కోరగా పొరపాటున వచ్చిన ఆ విస్తర్లను వెంటనే తొలగిస్తామన్నారు. ఈ విధమైన సంఘటనలు పునరావృత్తం కాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు.