News

పుల్వామా దాడికి ఏడేళ్లు.. ప్రధానమంత్రి నివాళులు

113views

పుల్వామా దాడి జరిగి ఏడేళ్లు అవుతున్న సందర్భంగా అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు భీకర దాడి (Pulwama attack)కి తెగబడిన విషయం తెలిసిందే. నాడు ఆ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనను ప్రధాని మోదీ గుర్తుచేసుకుంటూ.. వారి త్యాగాన్ని భారత్‌ ఎన్నటికీ మరిచిపోదన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టే మన భద్రతా దళాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద శత్రువని.. దానిని పూర్తిగా నిర్మూలించేందుకు భారత్‌ కట్టుబడి ఉందని అన్నారు.

‘పుల్వామా ఉగ్ర దాడిలో ప్రాణాలు అర్పించిన సైనికులకు నివాళులు అర్పిస్తున్నాను. వారి అత్యున్నత త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోడానికి బలమైన, సురక్షితమైన దేశాన్ని నిర్మించడం కోసం భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది’ -ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

‘పుల్వామా ఉగ్ర దాడిలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల అంకితభావం, సంకల్పం, దేశ సేవ, ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. మాతృభూమి సార్వభౌమత్వం, సమగ్రత కోసం గొప్ప త్యాగం చేసిన ధీర జవాన్లు, వారి కుటుంబాలను చూసి భారత్‌ ఎప్పుడూ గర్వపడుతోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది’ – హోంమంత్రి అమిత్‌ షా

‘2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్‌ జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు దేశం ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుంది. భారత్‌కు ఉగ్రవాదం కలిగిస్తోన్న తీవ్రమైన ముప్పును వారి త్యాగం ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటుంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించి, దేశాన్ని సురక్షితంగా మార్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది’ – రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌