
దేశ రాజధాని నగరం అయిన ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీలోని ఆర్ట్స్ ఫ్యాకల్టీ క్యాంపస్‌లో ఏబీవీపీ (ABVP), ఐసా (AISA) విద్యార్థి సంఘాల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఒక నిరసన కార్యక్రమం సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు తోపులాట, పరస్పర దాడులకు దారితీసింది.
జర్నలిస్టుపై దాడి జరిగిందన్న ఏబీవీపీ
క్యాంపస్‌లో జరుగుతున్న ఒక నిరసనను కవర్ చేయడానికి వచ్చిన ‘రుచి తివారీ’ అనే మహిళా జర్నలిస్ట్ పై వామపక్ష విద్యార్థి సంఘాల కార్యకర్తలు దాడి చేశారని ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సార్థక్ శర్మ వెల్లడించారు. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఆమెను మ్యాన్ హ్యాండిల్ చేశారని ఏబీవీపీ ఆరోపించింది. అసలు వీరంతా యూనివర్సిటీ విద్యార్థులు కారని, బయట నుంచి వచ్చిన వారే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాపై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటనపై మారిస్ నగర్ పోలీసులకుఫిర్యాదులు అందాయి. పోలీసులు ఇప్పటికే బాధితులకు వైద్య పరీక్షలు (MLC) నిర్వహించారు. ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం క్యాంపస్ వద్ద పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.





