News

సేంద్రియ సాగును ప్రోత్సహించండి

44views

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు గానూ ఆర్గానిక్‌ ఆహార ఉత్పత్తులను విజయ డెయిరీ పార్లర్‌ ద్వారా విక్రయించేందుకు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ముందుకు రావటం అభినందనీయమని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌ స్వామి అన్నారు. ఎన్టీఆర్ బాపులపాడు మండలం వీరవల్లిలోని కృష్ణా మిల్క్‌ యూనియన్‌ కామథేను పాల ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. చిన జీయర్‌ స్వామి చేపట్టిన ‘సుఫల రైతు యాత్ర’లో భాగంగా ఇక్కడకు విచ్చేసిన ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. కృత్రిమ ఎరువుల వినియోగంతో నేల, ఆహారం, వాతావరణం పూర్తిగా కలుషితమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తామని రైతులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ మార్గదర్శకాల మేరకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంభించే రైతులకు బాసటగా నిలుస్తామని యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు చెప్పారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ అధికారి మహేష్‌, కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఎండీ కొల్లి ఈశ్వరబాబు, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం చిన జీయర్‌ స్వామి హనుమాన్‌జంక్షన్‌లోని ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవ స్థానం, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాలను దర్శించారు.