News

పల్నాడు సంస్కృతికి ప్రతీకలు.. కోటప్పకొండ ప్రభలు

46views

కోటప్పకొండ తిరునాళ్లకు ప్రత్యేకం

పల్నాడు సంస్కృతికి ప్రభ ప్రతీకగా నిలుస్తుంది. వందల ఏళ్ల నుంచి ప్రభ నిర్మాణం ఇక్కడి పల్లె ప్రజలకు వారసత్వ సంపదగా వస్తోంది. మహాశివరాత్రికి కోటప్పకొండ జాతరకు వచ్చే ప్రభలు రాష్ట్రంలోనే ప్రసిద్ధి. చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలోని కావూరు, అప్పాపురం, కమ్మవారిపాలెం, అమీన్‌ సాహెబ్‌పాలెం, కోమటినేనివారిపాలెం, గంగన్నపాలెం, గోవిందపురం, మద్దిరాల, యడవల్లి, బొప్పూడి, పురుషోత్తమ పట్నం, గురవాయపాలెం, కాకాని గ్రామాల వారు ఏటా ప్రభలు నిర్మిస్తారు. సంక్రాంతి, దసరా, దీపావళి అన్ని పండగలు ఒకేసారి వస్తే ఆ సంబరం ఎలా ఉంటుందో.. శివరాత్రికి ఈ గ్రామాల ప్రజలు నిర్వహించే ప్రభల ఉత్సవం అంతకు రెట్టింపుగా ఉంటుంది. అసలు ఈ ప్రభలను ఎలా నిర్మిస్తారు. ఎన్ని రోజులు శ్రమిస్తారు, నిర్మాణంలో ఏమేం సామగ్రి వాడతారు. ఎక్కడ నుంచి తీసుకొస్తారు అనే వివరాలు తెలుసుకుందాం.

చింత చెట్టుతో ఇరుసులు
బండిలో ప్రధానపాత్ర పోషించేది ఇరుసులు. వీటికోసం ప్రత్యేకంగా చింతచెట్టు మొద్దును వినియోగిస్తారు. ఈ ఏడాది కావూరు ప్రభకు సంబంధించి రాజుపాలెం మండలం ఆకుల గణపవరం నుంచి దాతలు ఉచితంగా ఇరుసుల కోసం చింత చెట్లను ఇచ్చారు. వాటితో మూడు కొత్త ఇరుసులు తయారు చేశారు.

డొలుపులు, కమ్ములు.. వాటి తర్వాత బండిపైన ఆరు డొలుపులు, నాలుగు కమ్ములు ఏర్పాటు చేస్తారు. కావూరు గ్రామస్థులు ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతం నుంచి పాచికర్ర చెట్టు నుంచి వీటిని తీసుకొచ్చారు. వీటికి ఐదు క్వింటాళ్ల బరువైన ఇనుప రాడ్లు, బార్లు, యాంగ్లర్లు, కంప్లింగ్‌లు, బోల్టులు చిలకలూరిపేట నుంచి తీసుకొచ్చి ప్రభ బండిని సిద్ధం చేశారు.

వెలుగుల మందిరం
ప్రభ నిర్మాణం పూర్తయిన తర్వాత తిరునాళ్లకు రెండ్రోజుల ముందు పైకి లేపి గ్రామంలో నిలిపి ఉంచుతారు. అనంతరం ప్రభకు వెలుగుల మందిరం ఏర్పాటుచేస్తారు. ప్రభ నిర్మాణంలో ఈ మందిరాల ఖర్చు ఎక్కువ. వీటి నిర్వాహకులు కావూరు, అప్పాపురం, బొప్పూడి, పోతవరం, గోవిందపురం, గోనెపూడి, వినుకొండ తదితర ప్రాంతాల్లో 20 మంది వరకు ఉంటారు. తిరునాళ్లకు రెండ్రోజుల ముందు గ్రామంలో జరిగే పండగ, కోటప్పకొండ వద్ద తిరునాళ్లలో, ప్రభ గ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత మరోసారి ఊరి పండగ నిర్వహిస్తుంటారు. ఇలా మూడుసార్లు వెలుగుల మందిరం ఏర్పాటు చేస్తారు. దీనికోసం ఈ ఏడాది మందిర నిర్వాహకులు రూ.14 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. 600 వరకు రంగు రంగుల ట్యూబ్‌లైట్లు, 2 వేల విద్యుత్తు బల్బులతో వెలుగుల మందిరం తయారు చేస్తారు. ప్రతి ప్రభ వద్ద మందిర నిర్మాణానికి 50 మంది కార్మికులు పనిచేస్తారు. ప్రభ నిలబెట్టిన తర్వాత దానిపైకి ఎక్కి వెలుగుల మందిరం అమరిక పనులు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎంతో నైపుణ్యం అవసరం. ఒక్కోసారి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. వీటితో పాటు ప్రతి విద్యుత్తు ప్రభకు సుమారు 20 వరకు జనరేటర్లు ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రభ మిరుమిట్లు గొలుపుతూ చూపరులను ఆకట్టుకుంటుంది.

అత్యంత ప్రధానమైనది బండి
శివరాత్రికి నెల రోజుల ముందే ప్రభను తరలించే బండి పనులు ప్రారంభిస్తారు. దీని కోసం ముందు రాతి చక్రాలను ఏర్పాటుచేస్తారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రానైట్‌ క్వారీల నుంచి రాళ్లను తీసుకొచ్చి పోతవరం వద్ద శిల్పులతో చక్రాలను తయారు చేస్తారు. ప్రభను తరలించే బండికి ఒక్కోవైపు మూడు రాతి చక్రాల చొప్పున రెండువైపులా ఆరు ఉంటాయి. అవి అరిగిపోయే కొద్దీ ఏటా మారుస్తుంటారు.

తడిక నిర్మాణం
బండిపై ఏర్పాటు చేసే ప్రభను తడిక అంటారు. దీనికి సంబంధించి ఈ ఏడాది అన్ని ప్రభల వారు రొంపిచర్ల ప్రాంతంలో సరుగుడు తోటల నుంచి 50 అడుగుల పొడవైన కర్రలను తీసుకువచ్చారు. 25 కర్రలు నిలువుగా, వాటితో పాటు 15 నుంచి 20 అడుగుల వెదురు కర్రలు, 35 తాటిపెండలు అడ్డంగా కడతారు. వీటిని కొబ్బరిపీచు తాళ్లతో గట్టిగా కడతారు. అనంతరం మండిగంకు అనుసంధానం చేస్తారు. దీన్నే తడిక అంటారు. దీన్ని బండిపై ఉంచి 20 మోకు తాళ్లతో కదలకుండా గట్టిగా కడతారు. దీంతో ప్రభ సిద్ధమవుతుంది. అనంతరం రంగుల కాగితాలు, దేవతా మూర్తుల చిత్రాలతో అందంగా అలంకరిస్తారు. ఒక్కో ప్రభను 85 అడుగుల నుంచి 95 అడుగుల ఎత్తు వరకు నిర్మిస్తుంటారు. ఇందులో కూడా గ్రామస్థులు పోటీ పడతారు. ప్రభ చివరి భాగం నుంచి కింద వరకు ముందు, వెనుక 23 చొప్పున 46 పంబ తాళ్లను ఏర్పాటు చేసుకుంటారు. ప్రభ కిందకు వాలకుండా ఈ పంబ తాళ్లు బ్యాలెన్స్‌ చేస్తాయి. వీటిని పట్టుకునేందుకు గ్రామస్థులతో పాటు కార్మికులను కూడా నియమిస్తారు.