
( ఫిబ్రవరి 15 – మహాశివరాత్రి )
నిశ్శబ్దమే నాదమై నినదించే వేళ. అంధకారంలో జ్ఞానదీపం వెలిగే సమయం. పరమేశ్వరుడు కరుణార్ద్రహృదయుడై భక్తులను అనుగ్రహించే తరుణం. అదే పరమ పవిత్ర మహా శివరాత్రి పర్వదినం. మనసా వాచా పరమేశ్వరుని స్మరిస్తూ.. జాగరణలో దైవసన్నిధిని అనుభూతి చెందడమే పండుగ పరమార్థం.
కాలానికి అతీతుడైన మహాశివుడికి నిత్యం అభిషేకాలు, పూజలు చేస్తుంటాం. ఆయన మన మనసులోని మాలిన్యాలను తొలగించి స్వచ్ఛతను, సంతోషాన్ని ప్రసాదిస్తాడు. ఆ స్వామికి 64 రూపాలు ఉన్నాయని శివపురాణం పేర్కొంది. మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడి ఆరు విశిష్ట రూపాలను స్మరించి తరిద్దాం.
లింగోద్భవమూర్తి : ‘లింగమధ్యే జగత్ సర్వం’ అన్నారు. ఈ సృష్టిమొత్తం లింగరూపంలోనే ఉందన్నది సారాంశం. ఆధిక్యత గురించి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తిల మధ్య వివాదం తలెత్తింది. ఆ సంవాదాన్ని పరిష్కరించేందుకు పరమేశ్వరుడు అగ్నిలింగరూపాన్ని ధరించాడు. ఆ రూపానికి ఆది, అంతం ఎక్కడో చూసిరమ్మన్నాడు శివుడు. పరీక్షలో నెగ్గలేకపోయిన బ్రహ్మ అబద్ధపు సాక్ష్యం చెప్పించారు. సాక్ష్యం చెప్పిన ఆవు, మొగలిపువ్వులను శపించాడు శివుడు. మనమెంతటి సమర్థులమైనా, అధికులమైనా, వినయవిధేయలతో వ్యవహరించాలని, ధర్మానికి కట్టుబడి ఉండాలని హితవు పలికాడు. ఈ అపురూప ఘట్టం చోటుచేసుకున్న రోజును ‘మహాశివరాత్రి’ పర్వదినంగా వేడుక చేసుకుంటున్నాం. పూజలు, అభిషేకాలు చేస్తున్నాం. అలానే ప్రతినెలా కృష్ణపక్ష చతుర్దశి రోజును మాసశివరాత్రిగా పరమేశ్వరుని ఆరాధిస్తాం.
నటరాజమూర్తి : సృష్టి, స్థితి, లయల విన్యాసాలను తెలియజేస్తుంది నటరాజ స్వరూపం. విశ్వానికి సంబంధించిన సకలం, సర్వం నటరాజ భంగిమలో దర్శనమిస్తాయి. నటరాజు వలయాకార అగ్ని మండలం జగత్తు నిరంతర గమనానికి సంకేతం. కాలం నిలవదు, మార్పు తథ్యమని చాటుతుంది. కుడిచేతిలోని డమరుకం శబ్దమే సృష్టికి మూలమని తెలియజేస్తుంది. ఎడమ చేతిలోని అగ్ని జ్వాల లయకు ప్రతీక. అభయ ముద్రలో ఉన్న కుడి కింది చేయి భక్తులకు భయం వీడమని భరోసా ఇస్తుంది. కాళ్ల వైపు చూపుతున్న ఎడమ కింది చేయి శరణు వేడితే- మోక్షం ప్రాప్తిస్తుందని సూచిస్తుంది. మరుగుజ్జు రూపాన్ని తొక్కిపెట్టిన కుడి పాదం అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగిస్తున్నట్టుగానూ, పైకి లేచి ఉన్న ఎడమ పాదం విముక్తికి చిహ్నంగానూ దర్శనమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. జీవితం ఒక నృత్యమని, అందులో లయ సాధించినప్పుడే మోక్షం పొందుతామని నటరాజ స్వరూపం ప్రబోధిస్తుంది.
దక్షిణామూర్తి : సహజంగా మనలో ఉన్న పరిపూర్ణతను విద్య వ్యక్తపరుస్తుంది- అన్నారు స్వామి వివేకానంద. ఆ విద్యను అందించేది గురువు. శివుడు ఆదిగురువు. అపార ఆధ్యాత్మిక జ్ఞానసంపద ఉన్నప్పటికీ సమాధానం దొరకని అంశాలుంటాయి. అలా మహర్షులను సైతం తికమకపెట్టే ధర్మసందేహాలను దక్షిణామూర్తి నివృత్తి చేస్తాడు. ఊరికి ఉత్తరాన శ్మశానముంటుంది. ఆ శ్మశానమే శివుడి ఆవాసం. స్వామి దక్షిణాభిముఖుడై ఉండటంవల్ల.. ఈ రూపానికి దక్షిణామూర్తి అనే పేరొచ్చిందని చెబుతారు. అంతకుమించిన ఆంతర్యమూ ఉంది. ఆయనను ఆరాధించేందుకు ఉత్తరదిక్కుకి తిరగాలి కదా! అంటే మనం చివరికి చేరుకునే స్థలం వైపు. అక్కడికి చేరుకునేలోపు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి.. జ్ఞానం ఆర్జించేందుకు, చివరికి ముక్తిని పొందేట్లు చేయడానికి పరమశివుడు ఈ రూపం దాల్చాడు.
భిక్షాటనమూర్తి: బ్రహ్మతలను ఖండించిన దోషం పోవడానికి భిక్షాటనమూర్తి రూపం ధరించాడు శివుడు. జడలుకట్టిన జుట్టుతో, ఒంటిమీద పులి చర్మాన్ని, మెడలో పాములను ధరించి, బ్రహ్మకపాలాన్నే భిక్షాపాత్రగా చేసుకుని.. ఇంటింటా భిక్ష కోరుతూ వీధుల్లో తిరుగుతాడు. తమను తాము గొప్పగా ఊహించుకుని అహంకరించేవారు- పరమేశ్వరుడి నిరాడంబరత్వం చూసి పరివర్తన చెందడం తథ్యం. భిక్షాటనమూర్తి తన చివరి మజిలీగా వారణాసి చేరుకుంటాడు. రాజ్యం సుభిక్షంగా ఉందని విర్రవీగుతున్న కాశీరాజు- భిక్ష కోరుతూ తిరుగుతున్న శివుణ్ణి చూసి, తనకది అవమానమని ఆగ్రహించాడు. సాక్షాత్తూ అన్నపూర్ణాదేవి స్వామివారికి భిక్ష అందించడంతో పాటు రాజుకి జ్ఞానోదయం కలిగిస్తుంది. అహంకారం తలకెక్కితే.. ఇక ఎన్ని సంపదలున్నా.. అవన్నీ వ్యర్థమే నని ప్రబోధిస్తుంది భిక్షాటనమూర్తి స్వరూపం.
కాలసంహారమూర్తి : ఎదుటివారు చెప్పింది అపార్థం చేసుకుంటే ఘోర ఫలితం ఉంటుందని తెలియచేసేందుకు ఈ రూపం దాల్చాడు శివుడు. సంతానం లేని మృకండ మహర్షి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై- ‘వృద్ధాప్యం వరకూ జీవించే దుష్టపుత్రుడు కావాలా, పదహారేళ్లే జీవించినా తదుపరి చిరంజీవిగా మిగిలిపోయే కుమారుడు కావాలా?’ అనడిగాడు. సజ్జనుడే కావాలన్నాడు మహర్షి. అలా జన్మించిన మార్కండేయుడు బాల్యం నుంచే సదా శివధ్యానంలో ఉండేవాడు. అతడు- తిరుక్కడైయూర్ క్షేత్రం చేరుకుని అమరత్వం కోసం శివుణ్ణి పూజించసాగాడు. బాలుడికి మరణసమయం సమీపించగా యమధర్మరాజు వచ్చాడు. శివసన్నిధిలో ఉన్న మార్కండేయుని పైకి యమపాశం విడువగా అది శివలింగాన్ని తాకింది. దాంతో శివుడు ప్రళయకాల రుద్రుడిగా ప్రత్యక్షమై యముణ్ణి సంహరించాడు. కానీ మార్కండేయుని కోరిక మేరకు తిరిగి బతికించాడు. తన కర్తవ్యంలో ఈ పొరపాటు ఎలా జరిగిందన్న సందేహాన్ని యముడు వ్యక్తం చేయగా.. తానిచ్చిన వరంలో మరణం ప్రస్తావనే లేదు, పదహారేళ్ల తర్వాత చిరంజీవిగా మిగిలిపోతాడని మాత్రమే చెప్పానని వరంలోని ధర్మ సూక్ష్మాన్ని వివరించాడు. మనం ధర్మమార్గాన్ని అనుసరించేందుకు శివతత్వాన్ని అర్థం చేసుకోవాలి. అందుకు మహాశివ రాత్రి రోజున చేసే జాగరణ సరైన సమయం. లింగరూపంలో ఉన్న శివుని అర్చిస్తూనే, ఆ స్వామి వివిధ రూపాల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించాలి. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న నానుడిని గుర్తుంచుకుంటే మనకు ఎవరి మీదా, ఎన్నడూ కోపతాపాలు రావు. జన్మను సార్థకం చేసుకోగలుగుతాం. అలా జీవనం ప్రశాంతంగా గడిచేందుకు ఆ పార్వతీపరమేశ్వరులను పూజిద్దాం.





