News

ఒంగోలు జాతి పరిరక్షణలో లాంఫామ్‌ కేంద్రం విశేష కృషి

116views

రాజసానికి మారుపేరుగా నిలిచే ఒంగోలు జాతి పశువుల పరిరక్షణకు గుంటూరు సమీపంలోని లాం ఫామ్‌ కేంద్రంగా ఏర్పడిన పరిశోధన కేంద్రం శత వసంతాలకు చేరుకుంది. ఒంగోలు జాతి పశువుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతున్న తరుణంలో వాటి సంరక్షణ, విస్తరణ, వ్యాధుల నియంత్రణ, ఆరోగ్య పరిరక్షణకు విశేష కృషిచేస్తున్న ఈ సంస్థ 1926లో ఏర్పాటైంది. ఈ కేంద్రం కృషితో.. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒంగోలు జాతి పశువుల సంఖ్య పెరిగింది. పాలు, వెన్న, కోడెదూడల అమ్మకంతో రైతులు ఆదాయం గడించేవారు. ఈ ప్రభావంతో తమిళనాడులోని కోయంబత్తూరు, కర్ణాటకలోని హోసూరు ప్రాంతాల్లోనూ ఒంగోలు గిత్తల సంఖ్య పెరిగింది. పండుగలు, ఉత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాల సమయాల్లో పశు ప్రదర్శనలు గ్రామాల్లో కోలాహలంగా జరిగేవి. ఈ స్ఫూర్తితో ఎడ్ల పందేలు చాలాచోట్ల ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

ప్రభుత్వాల చేయూత..
లామ్‌ ఫామ్‌లోని పశు పరిశోధన కేంద్రం అనేక పరిశోధనలతో అన్నదాతలకు చేరువ అవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రత్యేక పథకాలు, నిధులను కేటాయించాయి. పరిశోధనల్లో భాగంగా విదేశీ ఆంబోతుల జన్యువులను చొప్పించి అధిక దిగుబడి ఇచ్చే కొత్త సంకర జాతిని తయారు చేశారు. విదేశీ జాతులైన హెచ్‌.ఎఫ్, బ్రౌన్‌ స్విస్, జెర్సీ ఆంబోతుల సంకరంతో ఏళ్లుగా జరిపిన ప్రయోగాల వల్ల 50-50 శాతం లక్షణాలు కలిగిన ఒంగోలు-హెచ్‌.ఎఫ్‌. సంకరజాతి రూపొందింది. మన దేశ ఉష్ణ మండల శీతోష్ణ స్థితిని తట్టుకుని అధిక ఉత్పాదక శక్తిని ఈ జాతి నమోదు చేసింది. స్వదేశీ జాతులైన ఒంగోలు, గిర్, హరియాణా, ధార్పార్కర్‌ గోవులను పరిరక్షించి.. జన్యుపరంగా అభివృద్ధిపై ఈ కేంద్రం దృష్టి సారించింది. పశువుల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న తరుణంలో మేలైన ఆవులు, ఆంబోతులను అనేక ప్రాంతాల నుంచి సేకరించి అభివృద్ధి పరిచారు. దిగజారుతున్న పాల ఉత్పాదక శక్తిని తిరిగి పెంపొందించే పరిశోధనలు చేశారు. ఒంగోలు జాతి పరిరక్షణలో భాగంగా పిండోత్పత్తి, పిండ మార్పిడి జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉత్తమ జన్యు సంతతిని పెంచేలా కృషి చేస్తున్నారు. పిండ మార్పిడి దూడ సైతం ఇక్కడ జన్మించడం విశేషం. ప్రస్తుతం లామ్‌ ఫామ్‌లో ఉన్న పిండ మార్పిడి ప్రయోగశాలను జాతీయ స్థాయి ప్రయోగశాలగా గుర్తించారు. ఈ సందర్భంగా లాంఫామ్‌ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఆచార్య యం.ముత్తారావు మాట్లాడుతూ.. ఒంగోలు జాతికి పునర్వైభవ దీప్తి, ఆధునిక జీవ సాంకేతిక పశు పరిశోధనలతో రైతు సేవలో శత వసంతాలు పూర్తిచేసుకోవడం గర్వకారణమని వ్యాఖ్యానించారు.